Sharmila Comments at Praja Prasthanam Padayatra: ప్రజా ప్రస్థానం పాదయాత్రలో కరీంనగర్‌లో జరిగిన బహిరంగసభలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆస్తుల సంపాదనే ఏకైక అజెండాగా ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారే తప్ప.. ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట నుంచి ప్రారంభమైన పాదయాత్ర కరీంనగర్ పట్టణానికి చేరుకొంది.
గ్రానైట్, ఇసుక మాఫియా తప్ప ప్రజల గురించి మంత్రి గంగుల కమలాకర్ పట్టించుకొనే పరిస్థితి లేకుండా పోయిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నా తెరాస అధిష్ఠానం నోరు మెదపడం లేదంటే.. ఈ మాఫియాలో అందరికి వాటా ఉన్నట్లే కదా అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా భాజపా ఎంపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ అంతర్గతంగా ఒక్కటన్నట్లే కదా అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.