కరోనా నుంచి ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కరీంనగర్ రీజియన్‌లో నిత్యం తిరిగే కిలోమీటర్లు పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతోంది. దీనికి తోడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసుల వ్యవహారం కొలిక్కి రావడంతో ఆదాయం మరింత పెరగనుంది. మంగళవారం నుంచి రీజియన్ నుంచి ఏపీకి బస్సు సర్వీసులు పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు మంథని డిపోకు చెందిన బస్సు సర్వీసును నడుపుతుండగా కర్నాటకకు సైతం బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
రీజియన్ నుంచి...
కరీంనగర్ రీజియన్‌లోని పలు డిపోల నుంచి 19 సర్వీసులు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు వెళ్లనున్నాయి. మరింత ఆదాయం ఆర్జించనుంది. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం 21,840 కిలోమీటర్లు తిరగగా సుమారు రూ.6 లక్షల ఆదాయం వచ్చేది. సుదీర్ఘ విరామం (ఏడు నెలల) తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులు నడపనుండటంతో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో పాటు ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గాడిన పడుతున్న ఆర్టీసీ
లాక్‌డౌన్ తర్వాత అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీ ఆదాయం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. రీజియన్‌లో బస్సులు కరోనా కంటే ముందు నిత్యం 3.50లక్షల కిలోమీటర్లు తిరుగుతూ రూ.1.20 కోట్లు ఆదాయం ఆర్జించేవి. అన్‌లాక్ తర్వాత మే 19 నుంచి బస్సులు రోడ్డెక్కినా.. అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు. ఎట్టకేలకు ఆగస్టు నుంచి ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఆదాయం రూ.64 లక్షలకు చేరగా 2.51 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులతో ఇది మరింత పెరగనుంది.