లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తరువాత మళ్లీ నేరాల కదలిక విషయంలో విరివిగా ఫోన్ కాల్స్ చేసేవారి సంఖ్య రోజుకింతగా అధికమవుతున్నాయి. ఇక సమాచారం అందిన వెంటనే కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు స్పందిస్తున్నారు. నిర్ణీత వ్యవధిలో బాధితుల చెంతకు చేరుతున్నారు. వారి సమస్య స్థాయిని బట్టి అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది మార్చి నెల నుంచి ఈ నెల 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఫోన్లు కలిపి రూ. 15వేలను దాటడం ఆపత్కాలంలో అండగా నిలబడమనే తీరుని కళ్లకు కడుతోంది.
సగటున రోజుకు.. 106 కాల్స్..
వివిధ సంబంధిత సమస్యలు, గొడవలు, ఇబ్బందుల కోసం జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున 106 మంది డయల్-100కు ఫోన్ చేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా ఇతర సమస్యలు ఉంటున్నప్పటికీ ప్రధానంగా మహిళలకు సంబంధించి గృహ హింసలు, ఇతర అఘాయిత్యాలపైనే ఫిర్యాదులందుతున్నాయి. గడిచిన ఐదు నెలల కాలంలో స్త్రీలపై అఘాయిత్యాల కోసం 1116 ఫోన్‌లు రాగా ఇందులో తొమ్మిది కేసుల్ని పోలీసులు నమోదు చేశారు. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఫోన్ వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి అవసరమైన సహకారాన్ని, సలహాల్ని మహిళా పోలీసులు అందిస్తున్నారు. ఎక్కువగా కౌన్సెలింగ్‌ల ద్వారా వివాదాల్ని సద్దుమణిగేలా తోడ్పాటునిస్తున్నారు.
ఇక షీ బృందంలోని మహిళా పోలీసులు ఇలాంటి వాటి విషయంలో తమ సహకారాన్ని అందించడంతోపాటు మహిళా పోలీస్‌స్టేషన్ ద్వారా గొడవల్ని రూపుమాపే ప్రయత్నాల్ని చేస్తున్నారు. ఇందుకోసం భార్యభర్తలకు అవసరమైన సలహాల్ని సూచనల్ని కౌన్సెలింగ్ రూపంలో అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు సహా ఇతరత్రా విషయాల్ని పలువురు పోలీసులకు తెలియజేస్తున్నారు. ఇక రోజూ వారీగా వస్తున్న ఫోన్‌కాల్స్‌లో కొన్ని తప్పుడు సమాచారంతో కూడిన సమాచారం కూడా అందుతుండటం పోలీసులకు ఇబ్బందిని కలిగిస్తోంది.