తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy in Veenavanka: 'పేదలు గొర్రెలు, గేదెలను మేపితే.. కేసీఆర్​ పిల్లలు రాజ్యమేలుతారా.?'

ఈటల రాజేందర్​తో తనకేమి చీకటి ఒప్పందం లేదని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ఓ శుభకార్యం సందర్భంగానే కలిశామని చెప్పారు. భాజపాతో కుమ్మక్కై.. ఆ పార్టీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతుంది కేసీఆర్​ అని ఎద్దేవా చేశారు. తాము హుజూరాబాద్​ అభ్యర్థిని ఆలస్యంగా బరిలోకి దింపినా.. ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అని స్పష్టం చేశారు. హుజూరాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా వీణవంకలో ఆయన ప్రచారం నిర్వహించారు.

Revanth reddy in Veenavanka
వీణవంకలో ప్రచారంలో రేవంత్​ రెడ్డి

By

Published : Oct 23, 2021, 7:45 PM IST

కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ తరఫున కరీంనగర్​ జిల్లా వీణవంకలో ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. మంత్రి కేటీఆర్​ చేసిన విమర్శలపై స్పందించారు. గోల్కొండ రిసార్ట్స్‌లో తాను, ఈటల రాజేందర్‌ కలుసుకున్నది నిజమేనని చెప్పారు. ఉద్దేశ పూర్వకంగా కాదని.. వేం నరేందర్‌రెడ్డి కుమారుడి లగ్నపత్రిక సందర్భంగా కలిశామని పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌తో చీకటి ఒప్పందం కోసం కలవలేదని సమాధానమిచ్చారు.

హుజూరాబాద్‌ ప్రజలు.. కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూర్‌ వెంకట్‌ను గెలిపించాలి. సత్తా ఉన్న అభ్యర్థినే బరిలోకి దింపాం. నియోజకవర్గ ప్రజలకు వెంకట్‌ అండగా ఉంటారు. స్వ రాష్ట్రంలో పేద పిల్లలు బర్లు, గొర్లు కాస్తుంటే.? కేసీఆర్​ పిల్లలు రాజ్యమేలుతారా.? పేద పిల్లలు వైద్యులు, ఇంజినీర్లు, కలెక్టర్లు కాకూడదా.? రాజ్యాధికారానికి బడుగు వర్గాలు పనికిరావా? తెరాస డబ్బులు తీసుకోండి.. ఓటు కాంగ్రెస్‌కు వేయండి. -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ప్రచారం చేస్తున్న సమయంలో నియోజకవర్గంలో రోడ్ల వెంబడి మొత్తం ధాన్యం ఆరబోసి ఉన్నాయని రేవంత్​ అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వీటి కొనుగోళ్ల గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఈ స్థాయిలో ధాన్యం పండుతుందంటే.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం​ నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టే కారణమన్నారు. ఇన్నాళ్లు ఒకే పార్టీలో తిరిగిన ఇద్దరికి ఇప్పుడు పడటం లేదని.. చమురు ధరల దోపిడీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములే అని ఆరోపించారు.

కిషన్​ రెడ్డి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయలేదా.?: రేవంత్​ రెడ్డి

ఇదీ చదవండి:Bhatti Vikramarka:' ఉపఎన్నిక తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితం'

ABOUT THE AUTHOR

...view details