Ponnam Prabhakar followers protested at Gandhi Bhavan : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని కోరుతూ కరీంనగర్ లోకసభ పరిధిలోని నాయకులు గాంధీ భవన్‌కు వెళ్లారు. గాంధీ భవన్‌కు చేరుకున్న ఆయా ప్రాంతాల నాయకులు.. కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసి పొన్నంకు ఎన్నికల కమిటీలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కొత్త మంది కార్యకర్తలు అర్థనగ్న ప్రదర్శనతో గాంధీ భవన్ ముందు బైఠాయించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన పొన్నం అభిమానులు.. తమ నాయకుడిని విస్మరించి పార్టీ పదవులు కట్టబెట్టడం దారుణమన్నారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో దృష్టి సారించాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీని వలన పార్టీకి ఎంతో లాభం చేకూరుతోందని వివరించారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రేను కలిశారు. పొన్నం ప్రభాకర్‌కు కీలక కమిటీల్లో బాధ్యతలు అప్పగించకపోవడం వలన తమకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar latest news : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ నేత అయిన పొన్నంకు బాధ్యతలు అప్పగించినట్లయితే పార్టీ కూడా బలోపేతం అవుతుందని సూచించారు. పొన్నంకు బాధ్యతలు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని మాణిక్ రావ్ ఠాక్రే హామీ ఇచ్చారు. గాంధీ భవన్‌కు వెళ్లిన వారిలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్, వేములవాడ, చొప్పదండి, సిరిసిల్ల, హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.