గత పది రోజుల క్రిందట ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో పార్వతీ బ్యారేజీ నిండుకుండలా మారింది. వెంటనే స్పందించిన అధికారులు ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహం తగ్గిపోవడంతో సోమవారం మూడు గంటల తర్వాత నుంచి గేట్లను మూసి వేశారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో ప్రజలు బ్యారేజీ వద్దకు పరుగులు పెట్టారు. తండోపతండాలుగా వచ్చి చేపలను పట్టడానికి పోటీ పడ్డారు. బ్యారేజీలోకి దిగి చేపలను పట్టుకుంటున్నారు.
పోలీసుల రంగప్రవేశంతో పరుగులు పెట్టిన ప్రజలు..
లుంగీలు, వలలు, సంచులు, బ్యాగుల్లో చేపలను తీసుకొని వెళ్తున్నారు. మరికొందరికీ తీసుకెళ్లేందుకు ఏంలేక చేతుల్లోనే పట్టుకెళ్తున్నారు. బ్యారేజీలోకి దిగడం ప్రమాదమని తెలిసినా పట్టించుకోకుండా ఎగబడుతున్నారు. సంబంధిత అధికారులకు విషయం తెలిసినప్పటికీ... తమకేం పట్టనట్లుగా నిర్లక్ష్యం వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులను చూసిన ప్రజలు పరుగులు తీశారు. కరోనా కాలంలోనూ ఎలాంటి మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తిరగడం భయాందోళనలకు గురిచేస్తోంది.