కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. యాస్వాడలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసి పోయాయని అన్నదాతలు వాపోయారు. రుతుపవనాలు సమీపిస్తున్నాయని చెప్పి అధికారులు ముందుగా ధాన్యం తూకం వేశారని.. మిల్లులకు తరలించే క్రమంలో అకాల వర్షం ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Paddy in rain: మూడ్రోజులుగా వర్షం.. మొలకెత్తిన ధాన్యం.. - paddy grains collapsed due to heavy rains
అకాల వర్షాలు అన్నదాతలకు ఆవేదన మిగిల్చాయి. పంటను అమ్ముకొని ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుదామనుకున్న తరుణంలో.. అధికారుల నిర్లక్ష్యం, దానికి తోడు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు వారికి కన్నీటిని మిగిల్చాయి. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం మిల్లులకు చేరకముందే వానలకు తడిసి ముద్దయింది.
పంటను కాపాడుకునేందుకు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టినట్లు రైతులు తెలిపారు. అయినప్పటికీ వరుస వానలు కుదేలు చేశాయని వాపోయారు. బస్తాల్లోనే ధాన్యం మొలకెత్తడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు. ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు కూలీలను పెట్టుకున్నా ఫలితం లేదని.. హమాలీలకు ఇచ్చేందుకు క్వింటాలుకు రూ. 45 చొప్పున భరించినప్పటికీ నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకొని ఎలాంటి తాలు లేకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:High Court: పిల్లల చదువు, కుటుంబ పోషణ ఎవరు చూస్తారు?