9 Crore Cyber Fraud In Karimnagar : తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం ఇప్పిస్తానని చెప్పి.. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని రాజన్న సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. పలువురి వద్ద నుంచి రూ.9 కోట్ల మేరకు డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మోసాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ వివరించారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కట్టుకోజుల రమేశ్ అలియాస్ రమేశ్ చారి అనే వ్యక్తి.. ప్రైవేట్ టీచర్‌గా ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం మానేసి.. ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ ఉద్యోగం చేయడం వల్ల తక్కువ డబ్బులు రావడంతో సరిపోక.. ఎలాగైన సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో వస్తువులు తక్కువ రేటుకు కొనేవాడు. ఆ తర్వాత వాటిని తన ఫేస్బుక్, సోషల్ మీడియా వేదికల్లో అతితక్కువ ధరకే ఇస్తానని చెప్పి పోస్టులు పెట్టేవాడు. అది చూసి చాలామంది అతనికి ఫోన్ చేసి.. వస్తువులు కొనేవారు. అలా రమేశ్ చారికి డెలివరీ ఖర్చుల డబ్బులు వచ్చేవని తెలిపారు.
Online Fraud Through Facebook : ఇలా అధిక మొత్తంలో డబ్బులు రావడం చూసి.. ఎలాగైనా తానే ఒక మార్కెటింగ్ వెబ్సైట్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇలా మొదటగా మోసాలు మొదలు పెట్టడం ప్రారంభించాడు. ఫేస్బుక్లో rameshchary అనే ఐడీని ఏర్పాటు చేసుకొని.. తన నంబర్లను లింక్ చేశాడు. అలా ఆన్లైన్ ఆఫర్ ద్వారా వచ్చిన వస్తువులు కొనుగోలు చేసి.. తక్కువ ధరకు మార్కెటింగ్ యాడ్ ఇచ్చేవాడు. ఇలా చాలా మందిని నమ్మించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. మొదటగా ప్రోడక్టు ఆర్డర్ చేస్తే.. వారు డబ్బులను తన ఖాతాలో జమ చేస్తేనే వస్తువులు డెలివరీ ఇచ్చేవాడు.