కరీంనగర్ ప్రజలు కరోనా భయం నుంచి తేరుకుంటున్నారు. మార్చి 17న కరీంనగర్‌లో తొలి కరోనా కేసు నమోదవడం వల్ల జనం ఉలిక్కిపడ్డారు. మరో వారంలోనే కేసుల సంఖ్య 14కి పెరగడం కలకలం రేపింది. అందులో ఒక్కరోజే 8 మందికి పాజిటివ్ అని తేలడం.. ప్రజల్లో వణుకు పుట్టించింది.
మొత్తం 18 కరోనా పాజిటివ్ కేసులు
కానీ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకున్నారు. ఐసోలేషన్‌లో ఉన్న 119 మందిని ఇళ్లకు పంపించిడమే కాకుండా.. హుజూరాబాద్‌లో 26 మందికి నెగెటివ్ రావడం వల్ల స్వీయ క్వారంటైన్‌లో ఉండమని అధికారులు సూచించారు. జిల్లాలో మొత్తం 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గాంధీ ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఇందులో దిల్లీ సభలకు వెళ్లి వచ్చిన వాళ్లు ముగ్గురు కాగా.. వారిలో ఒకరి నుంచి అతడి సోదరుడికి సోకింది. మిగతా ముగ్గురు కరీంనగర్ వాసులు.
మార్చి 14న కరీంనగర్‌కు ఇండోనేసియన్లు
మార్చి 14న ఇండోనేషియన్లు కరీంనగర్‌కు చేరుకున్న నాటి నుంచి.. వారిని గుర్తించి ఆస్పత్రికి పంపించే వరకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. వాళ్లు ఎక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేపట్టి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇండోనేషియన్లు కలిశారని అనుమానమున్న 82 మందిని తొలుత మార్చి 17న ఐసోలేషన్ వార్డులకు తరలించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
150 ప్రత్యేక బృందాలు
అన్నివైపులా దారుల్ని మూసి వేసి సుమారు 4 వేల కుటుంబాలను ఇళ్లకే పరిమితం చేశారు. ప్రజల రాకపోకల్ని నిలువరించారు. 150 ప్రత్యేక బృందాలు నగరంలో ప్రభావమున్న 36 వేల74 ఇళ్లలోని 1 లక్షా 36 వేల 348 మంది ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించాయి. జ్వరం, జలుబు ఇతర లక్షణాలున్న వారిని గుర్తించి అవసరమైన మందులిచ్చి జాగ్రత్తలు చెప్పారు.