తెలంగాణ

telangana

ETV Bharat / state

Minor Girl Rape in Karimnagar : ప్రేమ పేరుతో ఒకరు.. బెదిరించి మరో ఇద్దరు.. బాలికపై అత్యాచారం - కరీంనగర్‌లో పదో తరగతి బాలికపై అత్యాచారం

Rape on Minor Girl in Karimnagar : ఓ బాలిక తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్నప్పుడు అతడి స్నేహితులు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని చూపి బెదిరించి పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మరో ముగ్గురు స్నేహితులూ ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు మొదట షీ-టీమ్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో వెలుగు చూసింది.

Minor Girl Rape in Karimnagar
Minor Girl Rape in Karimnagar

By

Published : Jun 27, 2023, 10:26 AM IST

Karimnagar Minor Girl Rape News : ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పసి పాప నుంచి పండు ముసలి దాకా.. కామాంధులు ఎవరినీ వదలడం లేదు. వావి వరసలు మరచి.. పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తమ కామ వాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. బ్లాక్‌ మెయిల్‌తో ఒకడు, బెదిరించి మరొకడు, స్నేహం పేరుతో ఇంకొకడు, ప్రేమ, పెళ్లి.. ఇలా 'అఘాయిత్యానికి పాల్పడేందుకు అడ్డదారులెన్నో' అన్నట్లుగా బంధువులు, తెలిసిన వారు, పరిచయస్థులు, స్నేహితుల ముసుగు తొడిగిన వారే ఎక్కువగా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడేలా చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో తాజాగా ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది.

Rape on 10th Class Girl in Karimnagar : కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ ప్రేమికులు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసిన అతడి స్నేహితులు ఆ బాలికను బెదిరిస్తూ.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన ఇంటర్‌ చదివే వ్యక్తితో ఆమెకు ఉన్న పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే సుమారు ఏడాది క్రితం ఓ సందర్భంలో ప్రేమికులిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను బాలుడి ఫ్రెండ్స్‌ రహస్యంగా చిత్రీకరించారని పోలీసులు తెలిపారు.

ఆ ఫొటోలు, వీడియోలను కుటుంబసభ్యులకు చూపుతామంటూ బెదిరించి.. బాలికను లొంగదీసుకున్నారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను తమ ఫ్రెండ్స్‌తో పంచుకున్నారు. ఆ వీడియోలను చూపి.. ఇటీవల వారి స్నేహితులు మరో ముగ్గురు బాధిత బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో 3 రోజుల కిందట బాలిక షీ-టీమ్‌ను ఆశ్రయించింది. విషయం షీ-టీమ్‌ దృష్టికి వెళ్లడంతో వారు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేశారు. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు.

అయితే.. సోమవారం రోజున బాధిత బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నగరంలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జరిగిన తతంగమంతా వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలిక ప్రియుడు సహా ఆరుగురిపై అత్యాచారం, బెదిరింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఒకరు మేజర్‌ కాగా.. ఐదుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఐదుగురు ఇంటర్‌ చదువుతుండగా.. మేజర్ అయిన వ్యక్తి పాలిటెక్నిక్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.

ఇవీ చూడండి..

ఉద్యోగం పేరుతో 'ఆమె'ను వ్యభిచార ఊబిలోకి నెట్టిన అంకుల్​..

మైనర్​పై రెండేళ్లుగా రేప్.. దోషికి 142ఏళ్ల శిక్ష.. పోక్సో కోర్టు సంచలన తీర్పు

ABOUT THE AUTHOR

...view details