Minister Ponnam Prabhakar Counter To Bandi Sanjay : బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కరీంనగర్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ సిద్దాంతాలు వేరుగా ఉన్నవి ఎప్పటికీ ఒక్కటి కాలేవని స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చి వేస్తారని బండి సంజయ్ అంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లలో ఒకరి విషయాలు మరొకరికి తెలుస్తున్నాయి. అంటే రెండు పార్టీలు ఒక్కటే అనే మాట స్పష్టం అవుతోంద'ని మంత్రి అన్నారు. కాంగ్రెస్లో కోవర్టులు ఉన్నారని బండి సంజయ్ చెబుతున్నారని, ఆయన జ్యోతిషం ఏమైనా చదివారా అని ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం : బండి సంజయ్
సీఎం కేసీఆర్ అనే మూడక్షరాలే గొప్ప అన్నప్పుడు, జీవితాంతం అలాగే ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్కు పదవి అంటే ఎడమ కాలి చెప్పు అన్నప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్కు మళ్లీ రాజకీయాలెందుకని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ సిద్దాంతాలు వేరని, ఆ రెండు పార్టీలు ఒకటయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. మొన్నటి వరకు డబుల్ ఇంజిన్ సర్కారన్న బండి సంజయ్, ఇప్పుడు బీఆర్ఎస్ పని చేయడానికి సపోర్ట్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.
"కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారని బండి సంజయ్ చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఏం చేయబోతున్నారో బండి సంజయ్‌కు ఎలా తెలుసు? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనే అంశం స్పష్టమవుతోంది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ను చీలుస్తారని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదు." - పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి