Gangula on paddy procurement: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేంద్రం కావాలనే మాపే బురద జల్లుతోందని మంత్రి ఆరోపించారు. రైతుల ధాన్యం కొనేందుకు కేంద్రానికి ఇష్టం లేదన్న మంత్రి భౌతిక తనిఖీల పేరుతో రైస్ మిల్లులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోళ్లు పూర్తయ్యాక తనిఖీలు చేస్తే రాష్ట్రప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా దుర్శేడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.రాష్ట్రంలో జరుగుతున్న కొనుగోళ్లపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు
రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదు. మే 20 వరకు సరిపడ బ్యాగులు మా వద్ద ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. కొన్ని చోట్ల ఇంకా వరి కోతలు ప్రారంభం కాలేదు. ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి. వరిధాన్యం కొనుగోళ్లు ఎక్కడా ఆగలేదు. ఇది కేవలం మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే కేంద్రం లక్ష్యం. ఇలాంటి చర్యలతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారు.కేంద్రం కావాలనే మిల్లులపై దాడులు చేస్తోంది.
- గంగుల కమలాకర్, రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి
రాష్ట్రంలో గన్నీ సంచులకు ఎక్కడా కొరత లేదని మంత్రి గంగుల వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, గన్ని సంచులపై శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి... ఇప్పటివరకు 4 లక్షల 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని గంగుల కమలాకర్ తెలిపారు.