Manair river front project : కరీంనగర్‌ను సుందరంగా, పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దిగువ మానేరు డ్యాం గేట్ల కింది భాగంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, పర్యాటక శాఖ అధికారులు, కలెక్టర్‌తో కలిసి మంగళవారం స్థలపరిశీలన చేశారు. దిగువ మానేరు ప్రాజెక్టు గేట్ల వద్ద నుంచి తీగల వంతెన వరకు గల దూరాన్ని అంచనా వేసి ప్రజల ఆహ్లాదం కోసం ఎలాంటి నిర్మాణాలు చేపట్టారనే అంశాలను చర్చించారు.
రూ.410 కోట్లతో నిర్మాణం
కరీంనగర్‌కు ముఖ ద్వారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే క్రమంలో ఏర్పాటు చేసిన కరీంనగర్- వరంగల్ పాత రోడ్డులో తీగల వంతెనను ప్రత్యక్షంగా పరిశీలించారు. మానేర్ రివర్ ఫ్రంట్ డిజైన్ పోస్టర్లను అధికారులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్‌ను మొదటి దశలో 3.75 కిలోమీటర్ల వరకు పూర్తి చేస్తామని, రెండో దశలో 6.25 కిలో మీటర్లు పూర్తి చేస్తామని మంత్రి వివరించారు.
'వాటర్ ఫౌంటేన్స్, కల్చరల్ యాక్టివిటీస్ ప్లేస్, స్టీముల ఏరియా, థీమ్ పార్క్స్ వంటివి డిజైన్ చేస్తున్నాం. అందుకు సంబంధించిన భూమిని టూరిజం డిపార్టుమెంట్ అధికారులు పరిశీలించాం. రెండేళ్లలో దీనిని పూర్తి చేస్తాం. వైకుంఠఏకాదశి నాడు టెండర్ వేస్తాం. అతి త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం.'
-గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
ఆనందం.. ఆహ్లాదం..
మానేర్ రివర్ ఫ్రంట్ లో 12 నుంచి 13 అడుగుల లోతు వరకు నీరు నిల్వ ఉంటాయని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. ఇందులో స్పీడ్ బోట్లు, క్రూజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా,ఆహ్లాదాన్ని కలిగిస్తాయని వివరించారు. దిల్లీకి చెందిన ఐఎన్ఎస్ కన్సల్టెన్సీ... మానేర్ రివర్ ఫ్రంట్ పనులను చేపట్టనుంది.