స్వశక్తి సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు అవసరమైన బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం హుజూరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి స్వశక్తి మహిళ సభ్యులకు వ్యవసాయ, దాని అనుబంధ, వ్యవసాయేతర ఉత్పత్తులపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
స్వశక్తి మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి: మంత్రి ఈటల
హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి స్వశక్తి మహిళ సభ్యులకు వ్యవసాయ, దాని అనుబంధ, వ్యవసాయేతర ఉత్పత్తులపై అవగాహన, శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. స్వశక్తి మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని హామీనిచ్చారు.
మహిళలు తమకు అభిరుచి ఉన్న వృత్తులను ఎంచుకొని శిక్షణ పొందాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు చనిపోయి చిన్న పిల్లలున్న మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. స్వశక్తి సంఘాల్లో చదువుకున్న పేద మహిళల పిల్లలకు ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లతో పాటు బ్యాంకు రుణాలు మంజూరు చేయిస్తామని వివరించారు. అలాగే స్వశక్తి సంఘాల సభ్యుల కుటుంబాల్లో నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వం స్వశక్తి సంఘాలకు రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణాలు మంజూరు చేస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ సూచించారు. ఆధునిక జీవన శైలికి అనుగుణంగా వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎంచుకున్న యూనిట్లలో తయారైన ఉత్పత్తులకు సరైనా మార్కెటింగ్ ఉందో లేదో ముందుగానే అంచనా వేసుకోవాలని జిల్లా పాలనాధికారి కె.శశాంక సూచించారు. అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, ఆర్డీవో బెన్‌షలోమ్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర రావుతో పాటు, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీడీవోలు, స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :న్యాయవాద దంపతుల కేసులో మలుపులు