తెలంగాణ

telangana

ETV Bharat / state

బోల్తాపడిన కోడిగుడ్ల వాహనం.. ఎత్తుకెళ్లేందుకు ఎగబడిన జనం

Eggs Lorry Accident: మన కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందిస్తాం. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారేమోనని చూసి అంబులెన్స్​కు ఫోన్​ చేసి ఆపై పోలీసులకు సమాచారం అందించి మన చేతనైనకాడికి సాయం చేస్తాం. ఇదంతా అక్కడ ఏ సరుకూ లేనప్పుడే. పొరపాటుగా ప్రమాదానికి గురైన వాహనంలో.. తినేవి, తాగే వస్తువులు​ ఉంటే మాత్రం అప్పుడక్కడ పోటీతత్వమే కనపడుతుంది. తమవంతు బాధ్యతగా అంబులెన్స్​కు సమాచారం అందించి.. ఆ తర్వాత అందినకాడికి ఎత్తుకెళ్లిపోతారు. కరీంనగర్​ జిల్లా ఇస్లాంపూర్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అర్ధరాత్రి కోడిగుడ్ల వాహనం బోల్తాపడగా.. తెల్లారాక చూసిన స్థానికులు కోడిగుడ్ల లోడ్​ను ఖాళీ చేశారు.

eggs lorry collapsed at islampur
ఇస్లాంపూర్​ వద్ద బోల్తాపడిన కోడిగుడ్ల లారీ

By

Published : Apr 23, 2022, 12:53 PM IST

Eggs Lorry Accident: కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం ఇస్లాంపూర్​ వద్ద శుక్రవారం అర్ధరాత్రి.. డీసీఎం- సిమెంటు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కోడిగుడ్లను తరలిస్తున్న డీసీఎం బోల్తాపడింది. ఈ క్రమంలో వెనకే వస్తున్న మరో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో డీసీఎం డ్రైవర్​ తీవ్రంగా గాయపడగా... అందులో ఉన్న కోడిగుడ్లు నేలపాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు.. ప్రమాదాన్ని గమనించి అంబులెన్స్​కు సమాచారం అందించి ఆసుపత్రిలో చేర్చారు.

కాసేపటికి తెల్లవారింది. పనుల నిమిత్తం రోడ్డుపైకి వచ్చిన స్థానికులు.. రోడ్డుపై కోడిగుడ్ల వాహనం బోల్తా పడి ఉండటం చూశారు. అంతే ఒక్కసారిగా లోడ్ ఖాళీ చేసే పనిలో పడ్డారు. వారి వారి కుటుంబీకులకు సమాచారం అందించి అందినకాడికి ట్రేలలో గుడ్లను నింపుకెళ్లారు. మరికొందరయితే ఇంటి నుంచి బకెట్లు తీసుకొచ్చి.. వాటిలో తీసుకెళ్లారు. పిల్లలు, పెద్దలందరూ గుడ్లను ఏరే పనిలోనే నిమగ్నమయ్యారు. అంతేకాకుండా రోడ్డుపై పడిపోయిన ట్రేలపైకి ఎక్కి.. వాహనంలో ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చూసి మరీ తీసుకెళ్లారు. అలా క్షణాల్లోనే లోడ్ ఖాళీ చేశారు.

వాహనం బోల్తాపడటంతో వాటి యజమానికి ఎంత నష్టం వాటిల్లందనే సంగతి వారెవరూ ఆలోచించలేదు. మొత్తానికి పోలీసులొచ్చే సరికి పగిలిన గుడ్లు తప్ప.. పగలకుండా ఉన్న ఏ ఒక్క గుడ్డూ కనిపించకుండా చేశారు. ఇటీవల హైదరాబాద్ శివారులో సైతం ఇలాగే ఓ కూల్​డ్రింక్స్​ వాహనం బోల్తా పడితే.. ట్రేలతో సహా ఎత్తుకెళ్లిపోయారు.

ప్రమాదంలో బోల్తాపడిన కోడిగుడ్ల బండి.. ఎత్తుకెళ్లేందుకు ఎగబడిన జనం

ABOUT THE AUTHOR

...view details