Less Facilities in Karimnagar Govt hospital : ఉష్ణోగ్రత పెరగడంతో పాటు ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే..కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో బాలింతలు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. మాతాశిశు కేంద్రంలోని వార్డుల్లో సరిపోను ఫ్యాన్లు లేకపోవడంతో ఎండ వేడికి బాలింతలతో పాటు ముక్కుపచ్చలారని చిన్నారులు విలవిలలాడుతున్నారు. కేసీఆర్ కిట్ కారణంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు విధిగా తమతో ఫ్యాన్లు తెచ్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పురిటినొప్పులు మరోవైపు ఉక్కపోతతో ఆసుపత్రిలో బాలింతలు తల్లడిల్లుతున్నారు.
సరిపడా ఫ్యాన్లు లేకపోవడంతో బాలింతల ఇక్కట్లు : కరీంనగర్ మాతాశిశు కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. నాలుగు జిల్లాలకు కేంద్రం కావడంతో కాన్పు కోసం వచ్చే గర్భిణీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే కరీనంగర్ ఆసుపత్రిలో వసతుల పరిస్థితి మాత్రం అనుకున్నంత మేర లేకపోవడంతో బాలింతలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. వార్డుల్లో అక్కడక్కడ బిగించి ఉన్న ఫ్యాన్ల నుంచి వేడి గాలులు వస్తుండటంతో నవజాత శిశువులు కనీసం కంటి మీద కునుకు తీయడం లేదు. వేడి గాలులకు నూనూగు చర్మం కంది పోతోంది. కాన్పుల సంఖ్య పెంచాలన్న ప్రకటనలే తప్ప ప్రసవానికి వచ్చే గర్భిణులకుఆసుపత్రిలో కలిపిస్తున్న సదుపాయాలను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదన్న ఆవేదన బాలింతల్లో వ్యక్తమవుతోంది.
ఉక్కపోత నుంచి విముక్తికి సొంత ఫ్యాన్ల వినియోగం : ఆసుపత్రిలో 8 మహిళల వార్డులు ఉండగా ఒక్కో వార్డులో 20 మంది బాలింతలు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు చిన్నారులతో కలిపి సుమారు 40 నుంచి 50 మంది ఉంటున్నారు. కానీ వారికి ఏర్పాటు చేసిన ఫ్యాన్లు మాత్రం 5 మాత్రమే. రోజురోజుకు ఉక్కపోత పెరగడంతో ఏమి చేయాలో తోచని పరిస్థితి ఉందని ఆ మహిళలు వాపోతున్నారు. ఆపరేషన్లు, కాన్పు నొప్పులతో తాము మంచం మీది నుంచి కదలలేని పరిస్థితి ఉందని క్రిక్కిరిసిన వార్డులో ఆ ఫ్యాన్లతో వశపడక గత్యంతరం లేని పరిస్థితిలో ఇళ్ల నుంచి ఫ్యాన్లు తీసుకువస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.