Kusuma Rajaiah Ahimsa Silk : ఈ భూమిపై మానవుడు బతికేందుకు ఎంత హక్కుందో.. ఇతర జీవులు మనుగడ సాగించేందుకు అంతే హక్కు ఉంది. కానీ మనిషి తన స్వార్థం, ఆర్థిక అవసరాల కోసం వేరే ప్రాణులపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. తన ఆనందం కోసం వాటి ప్రాణాలు హరిస్తున్నాడు కూడా... ఈ విషయమే కుసుమ రాజయ్యను ఆలోచింపజేసింది. భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామంలో పుట్టిన ఆయన ఉద్యోగ రీత్యా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీసీవోలో పనిచేసేవారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్న వెంకటరామన్ హైదరాబాద్లో విడిది కోసం వచ్చారు. ఆయన సతీమణి పట్టు వస్త్రాలు కొనాలని భావించి.. పట్టు పురుగుల్ని చంపకుండా వస్త్రాలు తయారు చేయలేరా అని ఆమె అడగడంతో.. వాటిని చంపకుండా దారం తీయలేమా అని ఆలోచించారు.
1991లో తొలిసారిగా పరిశోధన చేసి ఆ ప్రయత్నంలో సఫలం అయ్యారు. కొన్ని చీరలు తయారు చేశారు. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో వస్త్రాలు తయారు చేసేవారు. సాధారణ పద్ధతిలో కంటే అహింసా పద్ధతిలో దారం తీస్తే 20 శాతం మాత్రమే దారం వస్తుంది. కాస్త మెరుపు తగ్గినా మెత్తదనం ఎక్కువ.. నాణ్యత అధికం. అయినా ఓ ప్రాణం తీయకుండా ఉన్నానన్న తృప్తి ఆయనను ముందుకు నడిపించింది. మొదట వీటిని మార్కెటింగ్ చేయడం కూడా కాస్త కష్టంగానే ఉండేది. కారణం ఈ విధానంలో ఉత్పత్తి ఖర్చు ఎక్కువ. అహింసా పట్టు విలువ తెలిసిన వారు మాత్రమే కొనేవారు. 2000 సంవత్సరంలో ఆయన పూర్తిగా అహింసా సిల్క్స్పై దృష్టి సారించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకపోవడంతో తన పీఎఫ్ డబ్బులతో ఉత్పత్తి ప్రారంభించారు. అలా క్రమంగా విస్తరిస్తూ నేడు 60 దేశాలకు పైగా వాటిని పంపుతున్నారు. దేశ విదేశాల్లో ఎంతో మంది ఆయన ఉత్పత్తులు కొంటున్నారు. వీరిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. అహింసా పద్ధతిని ఇష్టపడే కొందరు విదేశీయులు వీటిని ఆర్డర్ చేస్తారని అంటున్నారు రాజయ్య.
జంతు ప్రేమికుల కోసం.. అహింసా లెదర్ వచ్చిందోచ్!సృష్టికర్త
Ahimsa Silk Kusuma Rajaiah interview : ఒక పట్టు చీర తయారు చేయాలంటే సుమారు 40 వేల పట్టుపురుగుల్ని చంపాల్సి ఉంటుంది. అలా చేయకుండా అహింసా విధానంలో చేస్తే వాటి ప్రాణాలు కాపాడవచ్చు. ఈ విధానంలో పట్టు గూళ్ల నుంచి దారం తీయడం మరెక్కడా లేదు కాబట్టి తాను కష్టపడి పరిశోధించిన ఆ విధానంపై ఆయన పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా ఈ ప్రక్రియకు 6 నెలలు పడుతుంది. ఆయన 2002లో అప్లై చేస్తే 2006లో పేటెంట్ వచ్చింది.
ఆమోదించడానికి 4 సంవత్సరాలు పట్టింది. కారణం అది సాధ్యమని అంత సులువుగా వారు నమ్మలేదు. ఆ తర్వాత ఆయన ట్రేడ్ మార్క్ కూడా పొందారు. ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇతరులకు ఆ పని అప్పగిస్తే వారు నకిలీవి అమ్మే ప్రమాదం ఉందని భావించిన ఆయన తానే సొంతగా అమ్మకాలు చేస్తున్నారు. అహింసా విధానం గురించి తెలిసిన వారు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వారికి పంపిస్తున్నారు. పాతికేళ్ల ఆ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం లాభార్జనే ధ్యేయం కాకుండా పని చేసుకుపోతున్నా అంటున్నారు. కొన్ని ప్రముఖ దేవాలయాలకు కూడా ఉత్సవాల సమయంలో ఆయన తయారు చేసిన వస్త్రాలను తీసుకెళ్తున్నారు.