కరీంనగర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ టాస్క్‌ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు మహిపాల్ రెడ్డి. గతంలో రక్షణశాఖలో పని చేసిన అతను... గాయాల కారణంగా ఆ ఉద్యోగాన్ని విరమించుకున్నాడు. తర్వాత ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో ఉద్యోగం వచ్చింది. రక్షణశాఖలో పని చేసినప్పుడే మహిపాల్ రెడ్డికి ఎవరెస్టు ఎక్కాలన్న ఆకాంక్ష మొదలైంది. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినప్పటికీ... సహోద్యోగుల సహకారంతో తన ప్రయత్నాన్ని కొసాగించాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పర్వతారోహణ శిక్షణ కేంద్రంలో దాదాపు నెల రోజుల పాటు శిక్షణ పొందాడు. సుమారు 5898 మీటర్ల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించగలిగాడు. 2020లో ఎవరెస్టు ఎక్కాలని నిర్ణయించుకున్నాడు.
ఓ వైపు తాను శారీరకంగా సిద్ధమవుతూనే మరో వైపు పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతకు ఉచితంగా శిక్షణనిస్తున్నాడు. కేవలం విజయం సాధించడమే కాకుండా అపజయం నుంచి గెలుపు వైపు ఎలా పయనించాలో బోధిస్తున్నాడు.