కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రామంచ బూదవ్వ వారం కిందట హైదరాబాద్‌లో నివాసముంటున్న తన కూతురు వద్దకు వెళ్లింది. మూడ్రోజుల కిందట తిరిగి ఇంటికి బయలు దేరింది. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంటికి వెళ్లే వీలులేక బూదవ్వ జంగంపల్లి శివారులోని ఓ పాఠశాలలో తలదాచుకుంది. కుమారుడిని వచ్చి తీసుకెళ్లమని ఫోన్ చేసినా అతను రాలేదు. ఏం చేయాలో దిక్కుతోచక చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉన్న ఆ వృద్ధురాలిని చూసిన ఎస్సై ఆవుల తిరుపతి ఆరా తీశారు.
అన్నీతానైన తల్లి.. అనాథగా మిగిలింది...
కడుపులో నవమాసాలు మోసిన ఆ తల్లి బిడ్డ ఈ లోకంలో అడుగిడిన క్షణం నుంచి కంటికి రెప్పలా సాకింది. ఎన్నో బాధలు, కష్టనష్టాలకోర్చి కన్న బిడ్డను ప్రయోజకునిగా తీర్చిదిద్దింది. బిడ్డ ఆనందమే తన సంతోషంగా బతికింది. తను.. కడుపులో పెట్టుకుని చూసుకున్న ఆ కన్నకొడుకు వృద్ధాప్యంలో ఓ పూట తిండి కూడా పెట్టడం లేదని ఓ తల్లి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ గడప తొక్కితే... కన్న బిడ్డ ఆనందమే తన సంతోషంగా బతికిన మరో తల్లి నిలువ నీడలేక జోరువానలో చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది.
తన కుమారుడు ఇంటికి తీసుకెళ్లడం లేదని బూదవ్వ తన గోడును పోలీసుల వద్ద వెల్లబోసుకుంది. వివరాలు తెలుసుకున్న ఎస్సై ఆమెను కాన్వాయ్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బూదవ్వ కుమారుడు, కోడలిని ఫోన్ చేసి ఠాణాకు రప్పించారు. వారికి కౌన్సిలింగ్ ఇప్పింది.. ఇంకోసారి ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఆ వృద్ధురాలిని వారితో పాటు ఇంటికి పంపించారు.
కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం సిరిసేడుకు చెందిన భోగం పోచమ్మ అనే వృద్ధురాలు తన కుమారుడు సరిగ్గా చూసుకోవడం లేదని పోలీసుల వద్ద తన గోడు వెల్లబోసుకుంది. తిండి పెట్టడం లేదని వారి వద్ద బోరున విలపించింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న సీఐ పోచమ్మను తన గ్రామానికి తీసుకెళ్లి ఆమె కుమారుడు రఘుపతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని హితవు చెప్పారు.