హుజురాబాద్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోసును తప్పనిసరిగా తీసుకొని ఉండాలని తెలిపారు. అంతే కాకుండా రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు సైతం తప్పనిసరిగా రెండు డోసులు తీసుకొని ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు హుజురాబాద్ ఎన్నికల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో కొవిడ్ నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి తనిఖీ బృందాలను, ప్లైయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. నియోజకవర్గం పరిధిలో వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, కమలాపూర్ మండలాలున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిష్పక్షపాతంగా, కఠినంగా అమలు చేస్తామని సీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరుగకుండా... శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ...ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తామని సీపీ స్పష్టం చేశారు.