కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక ఈ నెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. గత హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఆయన పాదయాత్ర చేసి పర్యవేక్షించారు. స్థలానికి అనువైన మొక్కలను ఎంపిక చేసి...నాటాలని అధికారులకు సూచించారు. ఆరో విడత హరితహారం ఏర్పాట్లలో భాగంగా మేయర్ సునిల్ రావు, కమిషనర్ వల్లూరు క్రాంతిలతో కలిసి స్థల పరిశీలన చేశారు. కరీంనగర్‌లోని సిరిసిల్ల బైపాస్ రోడ్, ఉజ్వల పార్కు సమీపంలోని మానేరు డ్యామ్‌ను సందర్శించారు. డ్యామ్ దిగువ భాగంలో గతంలో నాటిన మొక్కల బ్లాకుల స్థలాన్ని పరిశీలించారు. క్రీడా పాఠశాల ఎదురుగా ఉన్న 5వ బ్లాక్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటిన 9వ బ్లాక్ వరకు డ్యామ్‌పై పాదయాత్ర చేస్తూ నిశితంగా సంబంధిత స్థలాలను పరిశీలించారు. లేక్ పోలీస్ స్టేషన్, వాటర్ ట్యాంక్, డ్యామ్ దిగువభాగంలో ఉన్న పలు దేవాలయాల స్థలాలను పరిశీలించారు.
నగరపాలక సంస్థ అధికారులు, ఫారెస్టు అధికారులకు హరితహారం గురించి పలు సలహాలు, సూచనలు చేశారు. గతంలో నాటిన హారితహారం బ్లాక్‌ల మధ్య స్థలాలను ఎంపిక చేసి.. మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా నగరంలోని భగత్‌సింగ్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు స్మార్ట్ రోడ్ పనులను పరిశీలించారు. పార్కింగ్, మల్టీ ఫంక్షనల్ జోన్‌కు సంబంధించిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక అధికారులతో కొలతలు వేయించారు. గుర్తించిన స్థలాలలో మియావోకి ప్లాంటేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.