రాష్ట్రంలో 18 లక్షలకు పైగా ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, మరో 18 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలాలను ఈ వర్షాకాలమే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. పనులు అన్నీ పూర్తి కాకపోయినప్పటికీ వీలైనంత మేర గోదావరి జలాలను ఎత్తి పోసి దిగువకు తరలించడం, చెరువులు నింపే లక్ష్యంగా సర్కార్ ముందుకు సాగుతోంది.
వెట్‌రన్‌తో కొత్త ఉత్సాహం
ప్రాజెక్టు రెండో లింక్‌లోని ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నుంచి మధ్యమానేరు వరకు పనులు దాదాపుగా పూర్తైన నేపథ్యంలో గోదావరి జలాలను మొదట దిగువకు తరలించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆరు, ఎనిమిది ప్యాకేజీల్లో పంపులు సిద్ధమయ్యాయి. సర్జ్ పూళ్ల నిర్మాణం కూడా పూర్తైనందున... వర్షాకాలంలో నీరు ఎత్తిపోసేందుకు వీలుగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆరో ప్యాకేజీలోని పంపులకు గతంలో డ్రైరన్ నిర్వహించిన ఇంజినీర్లు... ఇటీవలే వెట్ రన్ కూడా నిర్వహించనున్నారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నుంచి ఇప్పటికే ఆరో ప్యాకేజీలోని సర్జ్ పూల్‌కు నీరు విడుదల చేశారు. ఈనెల 22 వరకు సర్జ్ పూల్ పూర్తిగా నిండుతుందని అంచనా వేస్తున్న ఇంజినీర్లు... 124.4మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు పంపులతో... 24న వెట్ రన్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే అధిగమించి పూర్తి స్థాయి నీటి ఎత్తిపోతకు సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఏడో ప్యాకేజీ ద్వారా ఎనిమిదో ప్యాకేజీ సర్జ్ పూల్‌కు నీరు తరలించి అక్కడ కూడా పంపుల వెట్ రన్ చేపడతారు.
సవాల్‌గా నిలిచిన ఏడో ప్యాకేజీ కూడా పూర్తి...!
ఏడో ప్యాకేజీ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సొరంగాలు కుంగిపోయి సంక్లిష్టమై సవాల్ విసిరిన ఏడో ప్యాకేజీ సొరంగం పనులను అతి కష్టం మీద పూర్తి చేశారు. ఇక్కడి జంటసొరంగాల్లో మరో 800 మీటర్ల మేర సిమెంట్ లైనింగ్ పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా నెలాఖరు వరకు పూర్తవుతాయని అంచనా. ఆ తర్వాత ఎనిమిదో ప్యాకేజీలోని పంపుల వెట్ రన్ చేపడతారు. అక్కడ 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ పంపులు సిద్ధంగా ఉన్నాయి.
ఎస్సారెస్పీకి కడెం జలాలు
ఈ ప్రక్రియ పూర్తైతే ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నుంచి గోదావరి జలాలను మధ్యమానేరుకు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి ఎత్తిపోయవచ్చు. వర్షాకాలంలో వీలైనంత మేరకు ఎల్లంపల్లి నుంచే నీరు ఎత్తిపోయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లంపల్లి ఎగువన ఉన్న కడెం జలాశయానికి ఏటా భారీగా వరద వస్తుంది. దాదాపుగా వంద టీఎంసీల వరకు నీరు కడెం నుంచి దిగువకు వెళ్తుంది. ఈ నీటిని ఉపయోగించుకోవాలని భావిస్తోన్న ప్రభుత్వం... ఎల్లంపల్లి ద్వారా జలాలను ఎత్తిపోసి మధ్యమానేరు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎస్సారెస్పీకి తరలించేందుకు సిద్ధమవుతోంది. అక్కణ్నుంచి వీలైనంత దిగువకు నీరు ఇవ్వడంతో పాటు చెరువులు నింపేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.