కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ నియోజకవర్గంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నియోకవర్గంలో మందుగా వరి సాగు ఆరంభించిన రైతులు పంటలను కోసి... వాటి ఎండబెట్టేందుకు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో కురిసిన భారీ వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది.
అకాలవర్షం.. చేతికందిన ధాన్యం నీటి పాలు - తడిసిపోయిన వరిధాన్యం
ఆరుగాలం కష్టపడి పండించి... సొమ్ము చేసుకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ఆ రైతుల ఆనందం ఎంతో కాలం నిలువలేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసుకుంటుంది అనుకునే సమయంలో అకాల వర్షం వారికి కన్నీటిని మిగిల్చింది.
ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పిన ఫలితం లేకపోయింది. తడిచిన ధాన్యాన్ని తిరిగి ఎండబెట్టేందుకు రైతులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో ధాన్యం కొట్టుకుపోయి కాకతీయ ప్రధాన కాలువలో కలిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశామని, చేతికందిన ధాన్యం నీటిలో కలిసిపోందని వాపోయారు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వివరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మార్కెట్ యార్డును సందర్శించి... తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం