తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish rao campaign: హుజూరాబాద్​లో దూసుకెళుతున్న కారు.. ఆకట్టుకుంటున్న హరీశ్ ప్రచారం! - తెలంగాణ వార్తలు

హుజూరాబాద్ బైపోల్స్ కోసం మంత్రి హరీశ్ రావు తనదైనరీతిలో ప్రచారం(Harish rao campaign) చేస్తున్నారు. ఇల్లంతకుంట మండలం రాచపల్లి వెళ్తున్న మంత్రి... మార్గంమధ్యలో ఓ చిన్న టిఫిన్ సెంటర్​లో దోశ తినడం గమనార్హం. రోడ్డు పక్కన ఉన్న హోటల్​లో మంత్రి తినడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Harish rao campaign, huzurabad by election
హుజూరాబాద్ ఉపఎన్నిక, హరీశ్ రావు ఎన్నికల ప్రచారం

By

Published : Oct 11, 2021, 2:22 PM IST

హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం(Harish rao campaign) జోరుగా సాగుతోంది. తెరాస అభ్యర్థి తరఫున ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రచార బాధ్యతను తీసుకున్నారు. తనదైనరీతిలో ప్రచారం చేస్తూ... ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామంలో ప్రచారానికి వెళ్తూ... మార్గంమధ్యలో మరివాని పల్లిలో ఆగారు. అక్కడ ఒక చిన్న టిఫిన్ సెంటర్ కనిపించడంతో.. వెంటనే కారు ఆపి అక్కడ దోశ(harish rao) తిన్నారు.

మళ్లీ భోజనానికి వస్తా...

చిన్న టిఫిన్ సెంటర్​కు వెళ్లిన మంత్రి... టిఫిన్ ఏది బాగుంటుందని హోటల్​ యజమానిని అడిగారు. అక్కడ దోశ తిన్న మంత్రి... టిఫిన్ బాగుందని కితాబిచ్చారు. 'టిఫిన్‌ ఇక్కడ బాగా ఉంటదట... దావత్​లకు కూడా నీ దగ్గర వండించుకొని పోతారట కదా..' అంటూ హోటల్ యజమానిని ఆత్మీయంగా పలకరించారు. టిఫిన్ తిని బాగుందన్న మంత్రి.. మళ్లీ వచ్చి భోజనం చేస్తానని చెప్పి వెళ్లారు. అనంతరం ఓ ఇంటి వద్దకు వెళ్లి మహిళను పలకరించారు.

దోశ తింటున్న మంత్రి

రోడ్డు పక్కన టిఫిన్..

చిన్న టిఫిన్ సెంటర్​లో మంత్రి చాలా సాదాసీదాగా.. అందరితో కలిసి టిఫిన్ చేయడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'హరిశ్ రావు అంటే ఈయనేనా.. సార్ మాలాగానే గరీబోళ్ల లెక్క వచ్చారు.. టిఫిన్ తిన్నారు... కృతజ్ఞతలు సార్' అంటూ టిఫిన్ సెంటర్ యజమాని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా 'సార్ ఒక్క ఫోటో అంటూ..' కుటుంబ సమేతంగా ఫోటో దిగారు. రోడ్డు పక్కన హోటల్​లో మంత్రి టిఫిన్ చేయడంతో మరివానిపల్లి ప్రజలు మురిసిపోయారు.

మనసు దోచుకుంటున్న మంత్రి

హోరాహోరీగా సాగుతున్న హుజూరాబాద్ ప్రచారంలో మంత్రి హరీశ్ రావు(Harish rao campaign)... తనదైనరీతిలో ప్రచారం చేస్తూ ప్రజల మనసు దోచుకుంటున్నారు. ఇటీవలె ఓ చాయ్​వాలాతో ముచ్చటిస్తూ చాయ్​తాగిన మంత్రి... ఇవాళ రోడ్డుపక్కన టిఫిన్ తినడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిరంతర సర్వేలు

హుజూరాబాద్ ఓటర్ నాడీ తెలుసుకునేందుకు నిరంతర సర్వేలు కొనసాగుతున్నాయి. గ్రామాల వారీగా, వార్డుల వారీగా, ఓటర్ల వారీగా.. ఇలా ఏ ఒక్క అంశాన్ని వదలకుండా అన్ని కోణాల్లోనూ సర్వేలు జరుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో(TRS Strategy in Huzurabad By Election 2021) గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార తెరాస ప్రభావం ఎంత మేరకు పెరిగింది. ప్రత్యర్థి ఓటమి ఖాయం అయిందా లేదా అన్న అంశంపై అన్ని కోణాల్లో ఆరా తీయిస్తున్నారు. ఓ వైపున నిఘా వర్గాలు, మరో వైపున సర్వే ఏజెన్సీలు, మీడియా సంస్థలు ఇలా అవకాశం ఉన్న ప్రతి ఏజెన్సీతో గ్రౌండ్ రియాల్టీపై విశ్లేషిస్తున్నారు. మరో వైపు ఎక్కడెక్కడ లోపాలున్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు.

ఓటర్లలో వస్తున్న మార్పు ఏమేర..

ఐదు నెలలుగా ప్రచారంతో పాటు పథకాలతో హుజూరాబాద్ ఓటర్ల(Huzurabad Voters)ను ఆకట్టుకునేందుకు తెరాస చేయని ప్రయత్నం లేదు. చేసిన యత్నాలు ఏమేర ఫలిస్తున్నాయి? ఇప్పటి వరకు ఎంత మేరకు ఓటర్ల(Huzurabad Voters)ను తమకు అనుకూలంగా మల్చుకోగలిగామన్న దానిపై తెరాస ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యర్థి ఈటల రాజేందర్ ప్రభావాన్ని తగ్గించడంలో ఎంతమేర విజయం సాధించామన్నదానిపై ఆరా తీస్తోంది. ఆధిక్యత కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న విషయంపై బేరీజు వేసుకునే పనిలో పడింది. ఇంతకాలం సంక్షేమ పథకాలు, తాయిలాలు ప్రకటించగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా ఓటర్లను చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటోంది. ఏది ఏమైనా హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంగా సామదాన దండోపాయాలను అమలు చేస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details