తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ప్రజాదరణ.. రెట్టింపైన అడ్మిషన్లు - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు

government schools: పల్లెలతోపాటు పట్టణాల్లోనూ సర్కారు బడులకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధనకు తోడుగా ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ బడుల్లో పరిమితికి మించి విద్యార్థులు చేరుతుండడంతో 'నో అడ్మిషన్స్‌' అని బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రభుత్వ పాఠశాల
ప్రభుత్వ పాఠశాల

By

Published : Jul 2, 2022, 8:05 PM IST

ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ప్రజాదరణ.. రెట్టింపైన అడ్మిషన్లు

government schools: కరీంనగర్‌ కార్ఖానాగడ్డ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రోజురోజుకి బడిలో పెరుగుతున్న అడ్మిషన్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆంగ్ల మాధ్యమం, అత్యుత్తమ బోధన విధానంతో గతంలో ప్రైవేటు పాఠశాలల్లో చదివినవారు కూడా.. ఇప్పుడు సర్కారు బడివైపు పరుగులు తీస్తున్నారు. కార్ఖానగడ్డ ప్రభుత్వ పాఠశాలలో గతేడాది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 220 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యాసంవత్సరంలో అదనంగా మరో 150 మంది విద్యార్థులు చేరారు. గతంలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు ప్రస్తుతం కార్ఖానగడ్డ పాఠశాలలో చేరారు. ఈ పాఠశాలలో బోధనతోపాటు ఉపాధ్యాయులు ఆకట్టుకునేలా తరగతులు చెబుతున్నారని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం పేరిట తడిసిమోపెడవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ప్రభుత్వ బడిలోనే కార్పొరేట్ తరహాలో బోధన ఉండడంతో పిల్లల్ని చేర్పిస్తున్నట్లు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అడ్మిషన్లు అధికంగా వచ్చాయని కానీ వారందరిని చేర్చుకునేందుకు ఇబ్బందిగా ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికే తరగతి గదుల్లో విద్యార్దుల సంఖ్య అధికంగా ఉందని దానికి తోడు ఉపాధ్యాయుల కొరత కూడా ఉందని చెబుతున్నారు. అందుకే కొత్తవారిని చేర్చుకోలేమని బోర్డు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారం ఉన్నతాధికారులకు తెలియడంతో అవసరమైన సిబ్బందితోపాటు సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. నో అడ్మిషన్‌ అని బోర్డులు పెట్టవద్దని సూచించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతుండటంతో పిల్లలకు ఉత్తమ బోధన అందించేందుకు ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ సర్కార్ బడుల్లో అడ్మిషన్లు పెరగడంతో.. మిగతా చోట్ల ఇదే తరహాలో విద్యార్థులను చేర్పించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

"కరోనా కారణంగా వెనుకపడిన విద్యార్థులకు తగిన అభ్యసనాల ద్వారా భోధిస్తాం. ఇక్కడ చదువుకున్న పిల్లల అభ్యసనంలోని మార్పులను వారి తల్లిదండ్రులు గమనిస్తున్నారు. దీంతో చుట్టుపక్కలా పిల్లలను ఇక్కడ చేర్పించడానికి మిగతావారు ఆసక్తి చూపుతున్నారు." -ఉపాధ్యాయులు

ఇదీ చదవండి:హైదరాబాద్​ పరిసరాల్లో భారీ వర్షం.. రంగంలోకి జీహెచ్​ఎంసీ..!

స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వేతనం రూ.2లక్షలు!

ABOUT THE AUTHOR

...view details