పోచమ్మతల్లికి బోనం సమర్పిస్తున్న మహిళలు కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పోచమ్మ తల్లి అమ్మవారి చలిబోనాలు కన్నుల పండువగా జరిగాయి. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. హుజూరాబాద్ సిర్సపల్లిలో పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంగళ వాయిద్యాల నడుమ మహిళలు అమ్మవారికి బోనం సమర్పించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి గ్రామంలో సందడి నెలకొంది. అతివలు పెరుగు అన్నం, ఉల్లిపాయలు, ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను నిర్వహిస్తామని.. ఈ ఆచారం వల్ల సమస్యలు రాకుండా అమ్మ కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.