ఏకధాటిగా విద్యుత్ ఇవ్వకపోవడంతో వచ్చే కరెంటుతో తడిసిన పొలాలే మళ్లీ తడుస్తున్నాయి తప్ప.. పంటలకు నీళ్లు అందడం లేదు. యాసంగి సీజన్‌లో పొలాలు ఎండిపోతున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు కరెంట్ ఇవ్వడంతో పొలాల దగ్గరే రైతులు 24 గంటలూ పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారులు ఒక్కో ఊర్లో ఒక్కో సమయంలో కరెంట్ ఇస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో 99 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. పెద్దపల్లి జిల్లాలో ఒక లక్ష 33 వేలకు పైగా, జగిత్యాలలో 72 వేలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 73 వేలకు పైగా.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3 లక్షల 79 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. కొన్నిచోట్ల రాత్రి పూట ఇవ్వడం, మరికొన్ని చోట్ల పగటి పూట ఇవ్వడంతో పొలాలకు సరిగా నీరు అందడం లేదు. పొలాల దగ్గర ఉన్న కరెంట్ మీటర్ల దగ్గరే రైతులు పడిగాపులు కాస్తున్నారు. 24 గంటల కరెంట్ ఏమో కానీ ఐదారు గంటల కరెంట్ సరిగా ఉండటం లేదని వాపోతున్నారు.