తాను ఏమి చేతగానోడినైతే నా కుడి భుజమని ఎందుకన్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఈటల రాజేందర్ ( eetela rajender) ప్రశ్నించారు. నేను ముఖ్యమంత్రి కుర్చీకి పోటీ పడినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కుమారుడిని సీఎం చేసేందుకు అడ్డుగా ఉన్న వాళ్లందరినీ కేసీఆర్ వెళ్లగొడుతున్నారని ఈటల ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మడిపల్లిలో పలువురు నాయకులను కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు.
తనను గడ్డిపోచలాగా చూసిన మీకు ఇప్పుడదే గడ్డపారగా మారిన విషయం అర్థమయ్యిందని ఈటల అన్నారు. హుజూరాబాద్ గడ్డపై ధర్మానికి, న్యాయానికి మాత్రమే స్థానం ఉంటుందన్నారు. ప్రశాంతంగా ఉన్న తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని రాజేందర్ హెచ్చరించారు. దౌర్జన్యంగా కేసులు పెట్టాలని చూస్తే ముందుగా చిందేది తన రక్తపు బొట్టేనంటూ భావోద్వేగంగా మాట్లాడారు. కేసులు పెట్టాలనుకుంటే ముందు తనను జైళ్లో పెట్టాలన్న ఈటల.. ఏమీ అభివృద్ధి చేయకపోతే హుజూరాబాద్ ప్రజలు 6 సార్లు ఎలా గెలిపించారని ప్రశ్నించారు.
డబ్బు సంచులతో కొనలేవు
ప్రజల గుండెల్లో ఉన్న అభిమానాన్ని సారా సీసాలు, డబ్బుతో కొనలేరని ఈటల అన్నారు. తన కొట్లాట బానిసల మీద కాదని.. కేసీఆర్ మీదేనని స్పష్టం చేశారు. కేసీఆర్ డబ్బు సంచులకి.. తన ధర్మానికి మధ్యే ఈ ఎన్నికని పేర్కొన్నారు. కేవలం రెండు గుంటలు భూమి ఉన్నవాడు రూ.250 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నాడని నిలదీశారు. డబ్బులు, మద్యం, నాయకులను పక్కన పెట్టి కేసీఆరే పోటీ చెయ్యాలని ఈటల సవాల్ విసిరారు. తన చరిత్ర గురించి ఉప్పల్, జమ్మికుంట రైల్వే స్టేషన్, కరీంనగర్, మహబూబ్నగర్ జైళ్లను అడుగు, మానుకోట రక్తపు చుక్కను అడుగు.. చెబుతుందంటూ ఈటల రాజేందర్ ఉద్వేగంతో మాట్లాడారు.
మీ ఈటల రాజేందర్ సీఎం కుర్చీకి ఎసరు పెట్టిండ్రు అని మాట్లాడినరు. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని తనకు అడ్డంగా ఉన్నోళ్లు ఎవరో లెక్క తీసుకొని నన్ను ఎల్లగొట్టారు. ఈటల గడ్డిపోచ కాదని గడ్డపార అని ఇయాల అర్థమైంది. ఇక్కడ కూడా ఓ ఇన్ఛార్జ్ ఉన్నడట. రోజు దావత్లు ఇస్తున్నడట. ఆయనెవరో నాకు తెలియదు. నాకు ఏ బాధ్యత ఇచ్చినా సమర్థంగా నిర్వర్తించా. మా దగ్గరికి కొచ్చి మా వాళ్లనే కొంటారా ఖబద్దార్. ఇక్కడ ఎన్నికలు కేసీఆర్ డబ్బు సంచులకు.. ఈటల ధర్మానికి మధ్య పోటీ. ఆనాడు ఉద్యమంలో ప్రజలను నమ్ముకున్నావ్.. ఈరోజు డబ్బులను నమ్ముకుంటున్నావ్. హుజూరాబాద్ గడ్డమీద ఒకవేళ కేసులంటూ పెడితే మొదటి చిందేది నా రక్తమే. మీరు రెండు విషయాలు మర్చిపోకండి. నేను ఏమి అభివృద్ధి చేయలేదట. ఏమి చేతగానోన్ని ఎట్లా గెలిపించిర్రు. ఏమి చేతగానోన్ని నా రైట్ హ్యాండ్ అని ఎలా చెప్పినవయ్యా. నా జోలికి రాకండి. పార్టీ నుంచి నేను వెళ్లిపోలే. నన్ను ఎల్లగొట్టిన్రు. మొన్న కూడా ఎక్కడ ఓట్లు పడకపోతే 57 వేల మెజారిటీతో గెలిపించా.
- ఈటల రాజేందర్, మాజీమంత్రి
ఇదీ చూడండి:EETELA RAJENDER: 'నన్ను ఓడించే శక్తి.. తెరాసకు లేదు'