తెరాసకు ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే రేవంత్ రెడ్డిని కలిశానని హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకులను కలిశానని చెప్పారు. రేవంత్, ఈటల కుమ్మక్కయారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఈటల మాట్లాడారు.
నాలుగు నెలల కిందట రేవంత్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని.. అందరిలాగే ఆయనను కలిస్తే తప్పేంటని ఈటల ప్రశ్నించారు. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అన్ని పార్టీల నాయకులను కలిశానని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ అన్ని పార్టీల మద్దతు కూడగట్టలేదా అని ప్రశ్నించారు. అన్ని జాతీయ పార్టీల నేతలను కలవలేదా అన్నారు.
కేసీఆర్ సీఎం అయ్యాకే ఇతర పార్టీల నాయకులను కలవకూడదనే కుసంస్కారం మొదలైందని ఈటల విమర్శించారు. అప్పట్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే సంస్కారం ఉండేదన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఆ పరిస్థితిని కాలరాశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా మందిని కలవడం సహజమని ఈటల రాజేందర్ అన్నారు.