కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని దళిత బంధు పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్ దళిత ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమయ్యారు. ప్రతినిధులకు పథకం లక్ష్యాలు వివరించిన సీఎం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత సమస్యలు సహా దళితవాడల్లో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకు రాగా ప్రత్యేకంగా సర్వే నిర్వహించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. భూ సమస్యల్లో దళితుల అసైన్డ్, గ్రామకంఠం వంటి భూసమస్యలు పరిష్కరించాలని, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాలు, ఇళ్లపై నుంచి వెళ్లే విద్యుత్ తీగల తొలగింపు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దళితుల స్వాధీనంలోని గ్రామకంఠాల భూముల వివరాల జాబితా సిద్ధం చేయడంతో పాటు. దళితులకే హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టాలని.. ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. హుజూరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్ చేపట్టగా భూసమస్యలకు సంబంధించి 6000 సమస్యలు అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా వారసత్వ సమ్యలతో పాటు సాదాబైనామాలో కొనుగోళ్లు, ఇంటి నంబర్ల కేటాయింపు జరగని సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయి.
రూ.5 కోట్లతో పనులు
పంచాయతీరాజ్, పురపాలక, విద్యుత్‌శాఖలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితబస్తీల్లో పరిస్థితిని అధ్యయనం చేసి వివరాలు తెప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మరో అడుగు ముందుకు వేసిన అధికారులు.. సమస్యల పరిష్కారం ముమ్మరం చేశారు. ప్రధానంగా విద్యుత్ సమస్యతో తల్లడిల్లుతున్న దళిత వార్డుల్లో ఆ సమస్యను పరిష్కరించేందుకు దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 95 గ్రామాలు 139 దళితవార్డుల్లో వివిధ జిల్లాల నుంచి విద్యుత్ ఇంజినీర్లను రప్పించి సర్వే పూర్తి చేయించారు. చాలా వరకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు, కొత్తలైన్ల వేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఆపనులన్నీ 25 బృందాలు గత ఐదు రోజులుగా చేపడుతున్నాయి. నేటితో నియోజకవర్గంలోని మొత్తం దళితవార్డుల్లో 5 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి అవుతాయని అధికారులు చెప్పారు. ఇళ్ల మీది నుంచి వెళుతున్న విద్యుత్ లైన్ల తొలగింపు కూడా పూర్తి అయిందని... విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి వేయడం జరిగిందని ట్రాన్స్‌కో డీఈ విజేందర్‌రెడ్డి తెలిపారు.