Delay In Karimnagar Smart city Works :కరీంనగర్ టవర్‌సర్కిల్ వాణిజ్య కేంద్రంగా పేరుగాంచింది.. నిత్యం వేలసంఖ్యలో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి క్రయవిక్రయాల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. అందుకుగాను ఆ ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించారు. అమృత్‌సర్ తరహాలో దీనిని అభివృద్ధి చేసేలా చేయాలని తలపెట్టారు. దానికోసం రూ.26 కోట్లు కేటాయించడంతో ఆ పనులు 70 శాతం మేర పూర్తి చేశామని అధికారులు చెబుతుండగా, నత్తనడకన సాగుతున్న పనుల కారణంగా ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. రహదారులు, ఫుట్‌పాత్, విద్యుత్తు దీపాలు, రాత్రిపూట ప్రత్యేకంగా లైటింగ్, టవర్ సర్కిల్ నలువైపుల రోడ్డుపై టైల్స్ పనులు అతుకులమయంగా మారింది.
Karimnagar Tower Circle :టవర్‌సర్కిల్ వ్యాపార కూడలి కాబట్టి అలాంటి చోట పనులు చకచకా పూర్తి చేయాల్సింది ఉండగా మూడేళ్ల నుంచి సాగదీస్తున్నారు. ఇప్పటికీ ఆ పనులు పూర్తి చేయకపోగా, ఎక్కడ పడితే అక్కడ మధ్యలో కాల్వలు, టైల్స్, విద్యుత్తు పనులు వదిలేశారు. ఆ పనులపైపర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. స్మార్ట్‌సిటీ కన్సల్టెన్సీ ఉన్నా పట్టించుకోవడం లేదు. నాణ్యత ప్రమాణాలు కూడా పరిశీలించే వారే లేకుండా పోయారని వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
'నాకు జిరాక్స్ షాపు ఉంది. ఇక్కడ స్మార్ట్‌సిటీ పనులు ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతోంది. మా షాపు ముందు డ్రైనేజీ తవ్వారు ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదు. ఈ విషయం గురించి అధికారులను అడిగితే ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు.' - కుమారస్వామి, వ్యాపారి
Karimnagar Smart City Works : టవర్‌సర్కిల్ చుట్టూ నిర్మించిన టైల్స్ అధ్వానంగా ఉన్నాయి. పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో మొక్కుబడిగా వాటిని అతికించినట్లుగా ఉంది. టైల్స్ అన్నీ సమానంగా ఉండాల్సి ఉండగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండటం, ఫినిషింగ్ ఎక్కడా కనిపించడం లేదు. నడిచే ఫుట్‌పాత్ టైల్స్, విద్యుత్తు తీగలకు పైపులైను నాసిరకంగా వేయడంతో అవి మూసుకుపోయాయి. అందులోంచి విద్యుత్తు తీగలు రాకపోవడంతో పైనుంచి వేశారు.