తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వేళ ఆపన్న హస్తం.. గౌరవంగా తుది మజిలీ!

ఒక్క రూపాయి.. ఒకే ఒక్క రూపాయి.. ఛాయ్‌ నీళ్లు సైతం రాని రూపాయి.. అదే రూపాయితో అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా పూర్తిచేస్తూ అండగా నిలుస్తోంది కరీంనగర్‌ నగరపాలిక..  కరోనా మహమ్మారి కరాళ నృత్యం మొదలైన నాటినుంచి మరింత విస్తృతంగా సేవలందిస్తోంది.

corona-funerals-with-one-rupee-in-karimnagar
కరోనా వేళా ఆపన్న హస్తం.. గౌరవంగా తుది మజిలీ!

By

Published : May 24, 2021, 8:44 AM IST

Updated : May 24, 2021, 10:26 AM IST

యినవాళ్లెవరూ దరిదాపుల్లోకి రాని తరుణాన.. అన్నీ తామై.. బల్దియా కార్మికులు బంధుగణ రూపమెత్తుతున్నారు. సంప్రదాయానుసారం కర్మకాండను పూర్తిచేస్తున్నారు. ఇలా ఏప్రిల్‌లో 84, మేలో 150 కరోనా మృతదేహాలకు కేవలం రూపాయి రుసుముతో దహన సంస్కారాల్ని నిర్వహించారు. 2020 జులై నుంచి డిసెంబరు వరకు కొవిడ్‌ లక్షణాలున్న 158 భౌతిక కాయాలకు సైతం చివరిసేవ చేశారు.

క్లిష్ట సమయాన.. కొండంత అండగా

కరోనా మృతదేహాలకు అంత్యక్రియల్ని నిర్వహించడమంటేనే ఓ సవాలు.. అలాంటి సమయంలో కరీంనగర్‌ బల్దియా బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తూ అభినందనలు అందుకుంటోంది. రెండేళ్ల కిందట నగర పరిధిలో ఎవరు చనిపోయినా రూపాయికే అంత్యక్రియల్ని నిర్వహించాలని ఇక్కడి పాలకవర్గం తీర్మానించింది. ఒక్కో శవానికి దహనసంస్కారాల్ని సంప్రదాయబద్ధంగా చక్కబెట్టాలంటే కనీసం రూ.8వేల ఖర్చవుతుంది. కానీ, ఇక్కడ కట్టెలు, డీజిల్‌ సహా ఖర్చులన్నీ బల్దియానే భరిస్తోంది. అయినవాళ్లు సైతం మృతదేహాన్ని ముట్టని పరిస్థితుల్లో వాటికి కూడా కార్పొరేషన్‌ ద్వారానే దహనసంస్కారాల్ని జరిపేలా మేయర్‌ సునీల్‌రావు ప్రత్యేక చొరవ చూపించారు. ఏ వర్గం వారికైనా రూపాయికే అంతక్రియల్ని కొనసాగించాలని నిర్ణయించారు. అందుకయ్యే ఖర్చునంతా బల్దియా ఖజానా నుంచి వెచ్చిస్తున్నారు. సాధారణ మృతదేహాలకు రూ.8వేలు, కరోనా సంబంధిత శవాల అంత్యక్రియలకు అదనంగా రూ.10వేల వంతున గుత్తేదారుకు చెల్లిస్తున్నారు. ఇలా గతేడాది కాలంగా 1054 సాధారణ, 392 కరోనా మృతదేహాలకు అంత్యక్రియల్ని జరిపించారు. ప్రత్యేకించి నగర పరిధిలో మృతదేహాల తరలింపునకు రెండు వైకుంఠ రథాల్ని బల్దియా సమకూర్చింది. పీపీఈ కిట్లు, శానిటైజర్ల వినియోగం, కట్టెల కొనుగోలు సహా అంత్యక్రియల పరంగా ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. ఇది పేద కుటుంబాల పాలిట వరంగా మారుతోంది. మరోవంక.. కరీంనగర్‌ శ్మశానవాటికలో త్వరలోనే గ్యాస్‌ ఆధారిత దహనవాటికను ఏర్పాటు చేయించేలా మేయర్‌ చొరవ చూపిస్తున్నారు.

పేరుకే రూపాయి.. నిజానికిది ఉచిత సేవ

మనిషి జీవితంలో తుది మజిలీకి పూర్తి గౌరవమివ్వాలి.. ఆ ఉద్దేశంతోనే మా పాలకవర్గం ‘రూపాయికే అంత్యక్రియల నిర్వహణ’ కార్యక్రమం చేపట్టింది. నిజానికిది పేదలకు పూర్తిస్తాయిలో అందిస్తున్న ఉచిత సేవ. కరీంనగర్‌లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా లేదు. 2019 జూన్‌ 6 నుంచి బల్దియా తరఫున దీన్ని అమలు చేస్తున్నాం. ముఖ్యంగా కరోనా సమయంలో నా అనేవాళ్లు రాక రెండు మూడు రోజులు మృతదేహాల్ని ముట్టని రోజుల్లోనూ మా సిబ్బంది సేవ చేస్తున్నారు. అసలే మనిషి పోయి ఆవేదనలో ఉన్నవాళ్లకు, చేతిలో చిల్లిగవ్వలేని వాళ్లకు ఇది మాటల్లో చెప్పలేని సాయం అవుతోంది.

- సునీల్‌రావు, మేయర్‌, కరీంనగర్‌

కష్టమైనా చేస్తున్నాం

అనాథ మృతదేహాలు, కరోనా శవాలకు కర్మకాండలు చేయటం కష్టమనిపిస్తుంది. గుండె చిక్కబట్టుకుని ఆ పనుల్ని కొనసాగిస్తున్నాం. శవాల్ని తీసుకెళ్లిన రథాన్ని రోజులో అయిదారుసార్లు శానిటైజర్‌తో శుభ్రం చేస్తాం. వాటిని తరచూ కడగడం, ధరించిన పీపీఈ కిట్లను తగలబెట్టడం చేస్తుంటాం. కార్పొరేషన్‌ ఆదేశాల మేరకు మొత్తం 16 మంది నాలుగు బ్యాచ్‌లుగా ఈ పనులు చేస్తున్నాం.

- కె.కర్ణాకర్‌, కార్మికుడు

ఎంతో బాధేస్తుంది...


అయినవాళ్లు చెంత లేకుండా అంత్యక్రియల్ని మేము చేస్తుంటే బాధనిపిస్తుంది. పోయినేడాది నుంచి శవాన్ని చూసేందుకూ కుటుంబీకులూ జంకుతున్నారు. అయినా అన్నీ మేమై పనులు చేస్తున్నాం. వందల మందికి మా చేతులతో నిప్పుబెడుతుంటే ఒక్కోసారి ఏదో చెప్పలేని బాధ మనసుని మెలిపెడుతుంది. ఈ కరోనా సమయంలో మాత్రం రోజులో అయిదారుగురు చనిపోతుండటంతో వాళ్ల కోసం అయిదారుసార్లు పీపీఈ కిట్లు మార్చుకుని దహన సంస్కారాల్ని చేయాల్సి వస్తోంది.

- జి.శ్రీనివాస్‌, కార్మికుడు

ఇదీ చూడండి:బయటపడుతున్న లక్షణాలు... చిన్నారులకు ఎంఐఎస్‌ ముప్పు!

Last Updated : May 24, 2021, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details