రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక (huzurabad by election) ఫలితాలు వెలువడ్డాయి. అనుకున్నట్టుగానే అధికార తెరాస, భాజపా మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి రౌండ్ వరకు నువ్వా నేనా అన్నట్లు వచ్చాయి. ఆఖరి రౌండ్ వరకు గెలుపు ఇరువురి మధ్య దోబూచులాండింది. ఇక మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు (congress defeated in huzurabad by election). తొలిరౌండ్ నుంచి వెనుకబడిన కాంగ్రెస్‌కు ఏ రౌండ్లోను కనీస మెజారిటీ రాలేదు. ఒక్క అవకాశం అంటూ బరిలోకి దిగిన బల్మూరి వెంకట్ (balmuri venkat)... డిపాజిట్ కోల్పోయాడు.
ఆది నుంచి అంతంత మాత్రంగానే..
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి (tpcc chief revanth reddy) బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటగా వచ్చిన ఎన్నికలు కావడంతో... కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అంతటా చర్చ జరిగింది. కానీ గతంలో హస్తం పార్టీ నుంచి బరిలోకి దిగి.. ఓటమిపాలైన కౌశిక్ రెడ్డి.. హస్తం పార్టీని వీడి కారెక్కడంతో అక్కడ పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి కరవయ్యారు. ఎన్నో చర్చలు, తర్జనభర్జనల తర్వాత విద్యార్థి సంఘం నాయకుడు బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపారు. అయితే మొదట్లో ప్రచారం మాత్రం నిదానంగానే సాగింది. నామినేషన్ దాఖలు తర్వాత పార్టీ కీలక నేతలు అటువైపు చూడలేదు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రచార బాధ్యతను తీసుకున్నారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి భాజపా, తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. చివర్లో ప్రచార సంగ్రామంలోకి దిగిన రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు ప్రచార సభలతో హోరెత్తించారు. రేవంత్‌రెడ్డి తన మార్కు పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రచార సభల్లో చప్పట్లు కొట్టించిన మాటలు... ఓట్లు రాలడంలో మాత్రం ప్రభావం చూపలేకపోయాయి.
ఫలించని వ్యూహం
భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌పై (etela rajendar) పోటీకి దిగిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు విద్యార్థి సంఘాల నాయకులే. తెరాస తరఫున టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (gellu Srinivas yadav) బరిలోకి దిగగా... కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో ఆ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను ఖరారు చేసింది. కానీ అభ్యర్థికి బలమైన రాజకీయ అనుభవం లేకపోవడం, నియోజకవర్గంలో బలమైన కేడర్ లేకపోవడంతో పాటు.. పోటీ చేస్తున్న అభ్యర్థి స్థానికేతరుడు కావడం సహా అన్ని అంశాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి. మొదటి నుంచి అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్ ఫలితాల్లోను కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడింది.