హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంపై అధికార తెరాస మరింత పదును పెట్టనుంది. ఇప్పటికే నియోజకవర్గంలో హోరహోరి ప్రచారం జరుగుతుండగా.. ముఖ్యనేతలంతా అక్కడే మకాం పెట్టారు. మరోవైపు మూడు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా బరిలో దిగగా.. ఎలాంటి అవకాశాన్ని వదులుకోకుండా నియోజకవర్గ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముందు నుంచే.. ఆ పనిలో నిమగ్నమైన తెరాస.. ఈసారి పదునైన అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు ముందు నుంచే.. విజయానికి క్షేత్రస్థాయిలో తీవ్ర కృషి చేస్తోంటే.. ఇక చివరగా గులాబీబాస్ రంగంలోకి దిగనున్నారు.
రెండు రోజులపాటు రోడ్‌షోలు..
ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదనే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో తెరాస అధిష్ఠానం వ్యూహం మార్చింది. ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్‌కు పొరుగున ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ విషయంలో పునరాలోచిస్తున్నట్లు తెలిసింది. సభ సాధ్యం కాని పక్షంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై నేడు స్పష్టత వచ్చే వీలుంది.
ఈసీ ఆదేశాలతో మారిన వ్యూహం..
ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా సీఎం కేసీఆర్ 26 లేదా 27న సభ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం గురువారం తన నివాసంలో మంత్రులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు.