హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election)ల్లో ఓటర్లను ఆకట్టుకొనేందుకు అభ్యర్థులు ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు చేస్తున్న ప్రచారం (Huzurabad Campaign) ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఉద్యమం తరహాలోనే తాము రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాడామని చెప్పడానికి ఎవరికి వారే గొప్పగా కేసులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఎన్నికల కమిషన్(EC)కు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్న కేసులు చూస్తే ముక్కున వేలేసుకొనే పరిస్థితి ఉంది. దీనికి ఏ ఒక్క పార్టీ అతీతం కాదు. ఎవరికి వారే తాము తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించామని దానికి నిదర్శనమే తమపై ఉన్న కేసులని చెప్పి ఓటర్లను ఆకట్టుకొనే యత్నం చేస్తున్నారు. తొలుత కేసుల గురించి గొప్పగా చెప్పుకున్నా... ఆ తర్వాత విమర్శల జడివానలో తడిసిముద్దవుతున్నారు.
ఈటల కంటే ఎక్కువ..
హుజూరాబాద్ బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ (Bjp Candidate Etala Rajender) కంటే పార్టీలో సీనియర్‌నని చెప్పుకుంటూ ప్రచారం నిర్వహించిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ (Trs Candidate Gellu Srinivas Yadav)... తనపై 130కి పైగా ఉద్యమ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఉద్యమ ప్రస్థానంలో ఉస్మానియా వేదికగా గెల్లు చేసిన పోరాటాల ఫలితమే ఈ కేసులని ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం తెరాస నాయకులు చేశారు. నియోజకవర్గంలో గెల్లు శ్రీనివాస్ అందుబాటులో లేకపోయినా ఉద్యమంలో నిజంగానే బాగా పనిచేశారేమోనని తొలుత భావించారు. అయితే... చేసిన ప్రచారానికి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల్లో ఎక్కడా లేని పొంతన కనిపించింది. తనపై కేవలం 3 కేసులు విచారణ దశలో ఉన్నాయని గెల్లు శ్రీనివాస్ వివరించారు. మిగతా కేసులన్నీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తివేసిందా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
ఈటల రాజేందర్ ఇలా...
పార్టీలోకి... ఈటల రాజేందర్ మధ్యలో వచ్చిలో మధ్యలోనే వెళ్లిపోయారని అధికార పార్టీ చేసిన ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి తనదైన శైలిలో ప్రచారం చేశారు. తాను చేసిన పోరాటం గురించి ఉప్పల్ రైల్వేస్టేషన్‌ను అడిగినా చెబుతాయి. జమ్మికుంట స్టేషన్‌ను అడిగినా చెబుతాయి. జైలు గోడలనడిగితే చెబుతాయని పలుమార్లు ఈటల చెబుతూ వచ్చారు. ఎన్నోసార్లు జైలుకు వెళ్లాను. ఉస్మానియా వర్సిటీకి చెందిన పిల్లలు జైళ్లకు వెళితే తానే తీసుకొచ్చానని విసృత ప్రచారం చేశారు. అయితే ఈటల తనపై నమోదైన 19 కేసుల్లో 5 కేసులు విచారణ దశలో ఉన్నాయని వివరించారు.