హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad bypoll)కు భాజపా అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్(etela rajender) పేరును అధికారికంగా ప్రకటించింది.
Huzurabad bypoll: హుజూరాబాద్ భాజపా అభ్యర్థిపై అధికారిక ప్రకటన - హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్
11:27 October 03
హుజూరాబాద్ భాజపా అభ్యర్థిపై అధికారిక ప్రకటన
2019 సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ తరఫున తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల.. భారీ మెజార్టీతో గెలుపొందారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో పార్టీలో ఏర్పడిన పొరపొచ్చాల కారణంగా పదవికి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక(Huzurabad bypoll) అనివార్యమైంది. భాజపా తరఫున ఈటల కానీ ఆయన సతీమణి జమున కానీ అభ్యర్థిగా పోటీ చేసే ప్రచారం జరుగుతుండగా.. ఎట్టకేలకు ఈటల పేరును ఖరారు చేస్తూ భాజపా అధిష్ఠానం ప్రకటించింది.
ఇప్పటికే హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad bypoll) కోసం భాజపా నేతలు విస్తృత స్థాయిలో పాదయాత్రలు, పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు సైతం ప్రచారాల్లో పాల్గొంటూ తెరాస పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అధికార పక్షం కూడా తాము చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో హుజూరాబాద్‌లో గెలుపెవరిది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెరాస తరఫున బరిలో నిలిచిన గెల్లు శ్రీనివాస యాదవ్.. శనివారం తన నామినేషన్ వేశారు. భాజపా తరఫున ఈటల అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అధికార తెరాస, భాజపాలు హుజూరాబాద్ ఉప ఎన్నికలో దూసుకుపోతున్నారు. హస్తం పార్టీ తన అభ్యర్థిని ఎట్టకేలకు నిన్న ప్రకటించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగ్ రావును కాంగ్రెస్ తరఫున బరిలో దింపింది. హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30న జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇదీ చదవండి:AGRIGOLD: 'బతుకు భారమైంది.. డబ్బులు ఇప్పించండి'.. హైకోర్టుకు అగ్రిగోల్డ్ బాధితుడు