Bhatti Vikramarka People March Padayatra: తెలంగాణ తెచ్చుకున్నది ప్రజల కోసమా లేక బీఆర్ఎస్ నేతల కోసమా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఏ ఆశయం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో.. ఆ ఆశయం నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'హాథ్ సే హాథ్ జోడో' యాత్రకు కొనసాగింపుగా భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంచిర్యాల జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా భట్టి పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నీళ్లు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అయినా ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇన్నేళ్లయినా పెద్దపల్లి నియోజకవర్గానికి కాళేశ్వరం నుంచి చుక్క నీరూ రాలేదని మండిపడ్డారు. శ్రీరామ్ సాగర్ నుంచే సాగునీరు అందుతోందని ప్రజలు అంటున్నారని వివరించారు. లక్ష ఎకరాలకు దేవుడెరుగు.. ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎండాకాలంలో నిర్మించిన చెక్ డ్యామ్లు వానాకాలంలో కొట్టుకుపోతున్నాయని ఆరోపించారు. దీని ప్రకారం చూస్తే కేవలం కమీషన్లు కోసమే.. బీఆర్ఎస్ నేతలు చెక్ డ్యామ్లు నిర్మించారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీ తప్ప.. అభివృద్ధి కనిపించట్లేదని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు.