తెలంగాణ

telangana

ETV Bharat / state

Husnabad Bjp Meeting: తొలి సంతకం ఉచిత విద్య, వైద్యంపైనే..: బండి సంజయ్ - Smiriti Irani comments

భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ (Bjp State President Bandi Sanjay) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra) తొలివిడత శనివారం ముగిసింది. ఆగస్టు 28న హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమై 36 రోజుల పాటు 438 కి.మీ. మేర సాగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ (Husnabad Bjp Meeting)లో నిర్వహించిన ముగింపుసభకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి స్మృతిఇరానీ (Smiriti Irani) హాజరయ్యారు.

Bjp
ప్రజా సంగ్రామ యాత్ర

By

Published : Oct 3, 2021, 5:07 AM IST

Updated : Oct 3, 2021, 6:42 AM IST

రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించేలా తొలి సంతకం చేస్తామని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ (Bjp State President Bandi Sanjay) అన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా మొదటి పని ఇదే అన్నారు. గడీల పాలనకు చరమగీతం పాడతామన్నారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra) తొలివిడత శనివారం ముగిసింది. ఆగస్టు 28న హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమై 36 రోజుల పాటు 438 కి.మీ. మేర సాగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ (Husnabad Bjp Meeting)లో నిర్వహించిన ముగింపుసభకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి స్మృతిఇరానీ (Smiriti Irani) హాజరయ్యారు. సభలో సంజయ్‌ మాట్లాడుతూ.. ‘తెరాస అవినీతి పాలనను అంతమొందించి.. ప్రజాస్వామ్య తెలంగాణను సాధించేందుకే ఈ యాత్ర చేపట్టా. ఈ పోరాటమే చివరిది కావాలి. 2018 ఎన్నికల్లో తెరాస ఆశీర్వాద సభ పేరిట హుస్నాబాద్‌ నుంచే ప్రచారం ప్రారంభించింది. ఇప్పుడు ఈ యాత్ర ముగింపు ఆ పార్టీకి వీడ్కోలు సభ కావాలి. భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు స్వాగతవేదికవ్వాలి. యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలు, ప్రజల ఆకాంక్షలే వచ్చే ఎన్నికల్లో మా ఎజెండా.

అంతా కాషాయమయం

బ్రాండ్‌ అంబాసిడర్లు వీళ్లే...

ఓ సందర్భంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి ప్రతిపక్షాలు బ్రాండ్‌ అంబాసిడర్లని అన్నారు. నా పాదయాత్రలో సమస్యలు చెప్పుకొన్న బాధితులే రాష్ట్ర దుస్థితికి నిజమైన రాయబారులు. మెదక్‌ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు.. శిరీష అనే విద్యార్థి నా వద్దకు వచ్చి.. డిగ్రీ చదివినా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నానని చెప్పారు. మరో విద్యార్థి వనజాక్షి ఎంఏ చదివి చాయ్‌ అమ్మాల్సిన దుస్థితి ఏర్పడిందని కన్నీరు పెట్టుకున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులెంతో మంది పరిహారం రాలేదని వాపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం తెరాస రజాకార్ల పాలన కొనసాగుతోంది. నిర్మల్‌ జిల్లా భైంసాలో దాడులు మర్చిపోలేకపోతున్నాం. ఇలాంటివి పునరావృతమైతే.. అక్కడ భారీ సభ ఏర్పాటు చేసి భాజపా సత్తా చూపిస్తాం. రాష్ట్రంలో మత విద్వేషాలకు తావులేకుండా చేస్తాం. ఒక వర్గానికి కొమ్ముకాసే పార్టీల పాలనను అడ్డుకుంటాం. హిందూ సమాజానికి, పేద ప్రజలకు న్యాయం జరగాలంటే 2023 ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావాలి. తెరాస పాలనలో హిందువులు వినాయకచవితి ఉత్సవాలు జరుపుకోవాలన్నా.. అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. అభివృద్ధిపై మాట్లాడితే.. సంజయ్‌ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాడని కొందరు అంటున్నారు... 80 శాతం ఉన్న హిందువుల కోసం బరాబర్‌ పని చేస్తాం. హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ కేసీఆర్‌ కరీంనగర్‌లో మాట్లాడితే.. అక్కడ తెరాసను బొందపెట్టారన్న విషయం మర్చిపోవద్దు. హుజూరాబాద్‌లో తెరాస ఎన్ని డబ్బులు పంచినా విజయం మాత్రం ఈటల రాజేందర్‌దే. ఆ ఎన్నికల్లో భాజపా గెలుపు తర్వాత జైత్రయాత్ర పేరుతో.. ప్రజాసంగ్రామ యాత్రను తిరిగి కొనసాగిస్తా.

తెరాస గొప్పలకు పోతోంది..

ధనిక రాష్ట్రం అంటూ తెరాస గొప్పలకు పోతోంది.. అలా అయితే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సక్రమంగా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. వేల మంది ఫీల్డ్‌అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లు, స్టాఫ్‌ నర్సులు, పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను ఎందుకు తొలగించారు. సరైన సమయంలో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.వేల కోట్ల నిధులు ఇస్తుంటే..తెరాస నేతలు అన్నీ తామే చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు’ అని విమర్శించారు.

అభివాదం చేస్తున్న కేంద్రమంత్రి స్మృతిఇరానీ

తెలంగాణ వికాసం భాజపాతోనే సాధ్యం : స్మృతి ఇరానీ

ప్రజా సంగ్రామ యాత్రను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రజలకు వందనాలు అంటూ కేంద్ర మంత్రి స్మృతిఇరానీ (Smiriti Irani) మాట్లాడారు. ‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్‌ కుటుంబం (Kcr Family) పాలైంది. రాష్ట్రంలో అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడాలి. తెరాసకు కారున్నా.. స్టీరింగ్‌ మాత్రం ఎంఐఎం చేతిలో ఉంది. అలాంటప్పుడు తెలంగాణ వికాసానికి ఎలా పనిచేస్తారు. అది భాజపాతోనే సాధ్యం. వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే.. ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తానని హామీ ఇచ్చి అమలుచేయని వ్యక్తి కేసీఆర్‌.. ఆయన ఎంఐఎంను చూసి భయపడుతున్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి అనేక నిధులిస్తోంది. భాజపా అధికారంలోకి వచ్చాక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 2016లో 12 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పునరుద్ధరించాం. 18 కోట్ల మంది పేదలకు 14 నెలలుగా కేంద్రం ఉచిత రేషన్‌ ఇస్తోంది.

సొంతింటి కోసం ఆయన ప్రగతిభవన్‌ కట్టుకుంటారు.. సెక్రటేరియట్‌ను కూలగొట్టి కొత్తది కడుతున్నారు. పేదలుండేందుకు మాత్రం సొంతిళ్లు ఇవ్వరా. దళితుల అభ్యున్నతికి భాజపా ప్రభుత్వం రూ.25 వేల కోట్లు వెచ్చించింది. రైతుల కోసం పత్తికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వమే’ అని చెప్పారు. అనంతరం ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ‘హుజూరాబాద్‌లో అంబేడ్కర్‌ రాసిన రాజ్యం అమలు కావడం లేదు. కేసీఆర్‌ రాజ్యాంగాన్ని ఆయన బానిసలు అమలు చేస్తున్నారు. ఒక్క ఉప ఎన్నికకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదే ఖర్చు రాష్ట్రమంతా చేయాలి. ఎన్నికల ఫలితాలపై తెరాస ఎన్ని నివేదికలు తెప్పించినా.. గెలుపు భాజపాదే’ అన్నారు. అంతకు ముందు మధ్యాహ్నం బండి సంజయ్‌ పట్టణంలోని తిరుమల గార్డెన్‌ నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నేతలు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Oct 3, 2021, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details