Bandi Sanjay: కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదలయ్యారు. జైలులో బండి సంజయ్‌ను పరామర్శించేందుకు కేంద్రమంత్రి భగవంత్ కుబ వెళ్లారు. ఆయనతో కలిసి బండి సంజయ్ బయటకు వచ్చారు. కరీంనగర్‌లోని భాజపా కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన తీరును తప్పుబట్టిన హైకోర్టు.. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్‌ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్ జైలు వద్దకు భారీగా భాజపా కార్యకర్తలు తరలివచ్చారు.
జీవో 317 సవరించాలి..
ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసమే జైలుకు వెళ్లానని బండి సంజయ్ అన్నారు. జీవో 317 సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భాజపా కార్యాలయం ధ్వంసం చేశారని.. కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. మళ్లీ జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నానన్న బండి సంజయ్.. జీవో 317 సవరించినప్పుడే సంతోషిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపానే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులకు అండగా భాజపా ఉంటుందన్నారు. ఉద్యోగాలు పోతాయని ఉద్యోగులు భయపడవద్దని.. తిరిగి ఇప్పించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.