Bandi Sanjay Mulakath: కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆయన సతీమణి అరుణ, సోదరుడు శ్రవణ్, కుమారుడు ములాఖాత్‌లో కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పోలీసులకు పలు సూచనలు చేసినట్లు సతీమణి మీడియాకు వెల్లడించారు. పోలీసులు తనను అదుపులో తీసుకున్నప్పటి నుంచి అండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పినట్లు పేర్కొన్నారు.
ఈ అరెస్టులకు తాను భయపడేది లేదని 30లక్షల మంది యువకుల తరఫున పోరాడుతున్నట్లు ఆమె తెలిపారు. తనను ఆరెస్ట్ చేయడం పట్ల బాధ పడటం లేదని.. అరెస్టు చేసిన సందర్భమే బాగాలేదని అన్నట్లు చెప్పారు. అత్తయ్య కర్మకు హాజరయ్యేందుకు వచ్చిన తనను అక్రమంగా అరెస్టు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించారు. పోలీసులకు మొన్ననే విడుదలైన బలగం సినిమా చూపెడితే బాగుండేదని ఫ్యామిలీ ఎమోషన్స్ అర్ధమయ్యేవని.. బండి సంజయ్ అన్నట్లు ఆమె మీడియాకు వివరించారు. మరోవైపు ఈనెల 8వ తేదీన జరగనున్న ప్రధాని సభను విజయవంతం చేయాలని.. తన భర్త కోరినట్లు ఆమె తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. ఇలానే ఎలక్షన్ చివరి వరకు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ సభకు రాలేకపోతున్నాననే బాధ తనలో ఎక్కువగా ఉందని చెప్పారు. తాను 30 లక్షల మంది యువత కోసం కష్టపడుతుంటే.. గవర్నమెంట్ తనని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిందని సంజయ్ బాధపడ్డారు." - అపర్ణ, బండి సంజయ్ భార్య