హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం కీలకదశకు చేరుకుంది. పోలింగ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ పూర్తిస్థాయిలో ప్రచారంలో నిమగ్నమయ్యాయి. పార్టీలన్నీ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.
తెరాస ప్రచారం..
హుజురాబాద్‌లో అధికార, విపక్షాలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. వావిలాలలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. తన రాజీనామాతోనే పథకాలన్ని వచ్చాయంటున్న ఈటలపై మంత్రి ధ్వజమెత్తారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఏం మాట్లాడాలో తెలిక ఈటల ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరిన హరీశ్.. అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
భాజపా ప్రచారం..
రాజకీయ జీవితంలో మచ్చలేకుండా ప్రజలకు సేవ చేశానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఓట్ల కోసం తనపై అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మిపూర్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగి కుటుంబానికి డబ్బులు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంత తప్పుగా మాట్లాడితే అన్ని ఓట్లు తనకు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.
అందరి భరతం పడతా..
"నా రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదు. కానీ ఇక్కడికి వచ్చిన నాయకుల మాటలు మనసు గాయపరుస్తున్నాయి. ఈనెల 30 వ తేదీ వరకే ఈ బాధ. ఆ తర్వాత అందరి భరతం పట్టడం ఖాయం. మీరు ఎంత మాట్లాడితే మాకు అన్ని ఓట్లు పెరుగుతాయనే విషయాన్ని మరవవద్దు. కేసీఆర్ కాళ్లు పైకి పెట్టి తలకాయ కిందకు పెట్టినా.. తెరాసకు ఓట్లు పడవు. ఊర్లను బార్లుగా మార్చారు. ఓటుకు 20 వేలు ఇస్తారట. రాజీనామా చేసి కూడా మీకు పనికి వచ్చినందుకు సంతృప్తిగా ఉంది."- ఈటల రాజేందర్, భాజపా అభ్యర్థి.
కమల వ్యూహం..
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో నేతలను హుజురాబాద్‌కు తరలించిన భాజపా... గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, విజయశాంతి, రఘునందన్‌రావులు ఈటల తరఫున ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేటి నుంచి ప్రచారం చేయనున్నారు. మరోవైపు ఈ నెల 27న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించబోయే సభకు ధీటుగా బహిరంగ సభను నిర్వహించాలని భాజపా యోచిస్తోంది. ఈ సభకు జాతీయ నాయకులతో పాటు కేంద్రమంత్రులను ఆహ్వానించాలని భావిస్తోంది.
కాంగ్రెస్ ప్రచారం...
హుజురాబాద్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ రోడ్ షో నిర్వహించారు. ప్రశ్నించే గొంతును ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ ఆస్తుల రక్షణ కోసమే ఈటల భాజపాలో చేరాడని ఆరోపించారు. గత ఎన్నికల్లో తెరాస ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్న వెంకట్... ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: