మనిషి చనిపోతే ఎక్కడ ఖననం చేయాలో తెలియక నిరుపేదలు చెరువులు, వాగులు, కాలువులు దగ్గర ఎక్కడ స్థలం దొరికితే అక్కడ దుర్భరమైన పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహించేవారు. చివరి మజిలీ అయినా చక్కగా చేద్దామంటే సొంత భూమి లేక చాలామంది అంత్యక్రియలు ఎక్కడపడితే అక్కడ చేసేవారు. పట్టణాలలో అయితే స్మశానవాటికలు ఉండటం వల్ల పట్టణ ప్రజల చివరి మజిలీ గౌరవప్రదంగా సాగుతుంది. గ్రామాల్లో కూడా చివరి మజిలీ గౌరవప్రదంగానే సాగాలని.. రాష్ట్ర ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో కూడా వైకుంఠధమాలు ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు ఉండగా 654 వైకుంఠధామాలు మంజూరయ్యాయి .ఇందులో ఇప్పటివరకు 41 వైకుంఠ ధామాల నిర్మాణ పనులు పూర్తవగా... 117 చివరి దశలో ఉన్నాయి. మిగతా వాటి నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. 10 గ్రామాల్లో ఇప్పటి వరకు స్థలాన్నే గుర్తించలేదు.
నిర్మాణం పూర్తయిన గ్రామాలలో వైకుంఠధమాలను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుంటే... ఇంకా వైకుంఠ ధామాల నిర్మాణం మొదలుపెట్టని గ్రామాల ప్రజలేమో.. మా ఊరిలో వైకుంఠధామం పూర్తయ్యేదెన్నడు? అని అడుగుతున్నారు. అన్నీ సౌకర్యాలతో వైకుంఠధామాలు నిర్మిస్తుండటం వల్ల ప్రజలు వైకుంఠ ధామాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఖననం పూర్తయిన తర్వాత వచ్చిన వారి కోసం స్నానాల గదులు, శౌచాలయాలు కూడా నిర్మిస్తున్నారు. వైకుంఠధామం లోపల చుట్టుపక్కల మొక్కలను పెంచుతున్నారు. గన్నేరు, మందార వంటి పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. వైకుంఠధమాల చుట్టూ కంచె ఏర్పాటు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన వైకుంఠధామం జిల్లాలోనే మొదటిగా పూర్తిచేశారు. జిల్లాలో మొదటి వైకుంఠ ధామం పూర్తి చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠధామం లోపల స్నానపు గదులు, శౌచాలయాలు, సేద తీరడానికి బల్లలు, చుట్టూ కంచె వేసి లోపల గోరింటాకు చెట్లను కంచెలాగా నాటారు. స్మశానవాటిక అంటే.. భయంకరమైన వాతావరణం ఉంటుంది అనే భావనను కొట్టి పారేస్తూ.. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వైకుంఠధామాలు నిర్మిస్తున్నారు. మా ఊరిలో స్మశాన వాటిక లేకపోవడం వల్ల చెరువు దగ్గర ఖననం చేసేవాళ్ళం. ఇప్పుడు వైకుంఠధామం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని రాజంపేట మండలం సిద్ధాపూర్లో రెండు, మూడుసార్లు వైకుంఠ ధామం ఏర్పాటు చేద్దామని పనులు మొదలు పెట్టిన తర్వాత.. కొన్ని కారణాలతో ముందుకు సాగలేదు. అయినా వెనక్కి తగ్గకుండా గ్రామానికి దగ్గరలో ఉన్న గుట్ట కింది భాగాన్ని తొలిచి వైకుంఠధామం పూర్తి చేశారు. అయితే ఇప్పటికీ చాలా గ్రామాల్లో వైకుంఠధామం నిర్మాణానికి స్థలం కొరత సమస్య వేధిస్తున్నది. మరికొన్నిప్రాంతాల్లో వేర్వేరు కారణాలతో పనులు మొదలు కాలేదు. పనులు ప్రారంభించిన కొన్ని గ్రామాల్లో.. అధికారుల పర్యవేక్షణ లేక, కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల పనులు ముందుకు సాగడం లేదు.పల్లె ప్రగతి పనుల్లో చేపట్టిన వైకుంఠధామాలను తొందరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మంజూరైన వైకుంఠధామాలను త్వరలోనే పూర్తి చేసి.. ప్రజలకు అందిస్తామని జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు.