కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అధికంగా కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామాలు అల్లకల్లోలం అవుతున్నాయి. మారుమూల గ్రామాల్లోనూ కొవిడ్ విజృంభిస్తోంది. దీంతో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం ప్రజలు స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకున్నారు.
కొవిడ్ విజృంభణ... గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతుండడంతో గ్రామాల్లో ప్రజలు హడలిపోతున్నారు. తమకు తాముగా స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం కొవిడ్ అధికంగా వ్యాపించడంతో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలకేంద్రంలో సెల్ఫ్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు.
ఐదు దాటితే మూసివేయాల్సిందే:
మండల కేంద్రంలో సాయంత్రం 5 గంటల తర్వాత వ్యాపార సముదాయాలు మూసివేయాలని నిర్ణయించారు. మండలంలో ఎవరైనా మాస్క్ లేకుండా తిరిగితే ఫోటోలు తీసి పోలీసులకు పంపిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 40 నుంచి 50 మందికి రూ.1000 జరిమానా విధించారు. గ్రామంలో వైద్యపరమైన దుకాణాలు తప్ప మరే ఇతర సముదాయాలు తెరిచి ఉంచరాదని... వైన్స్ కూడా సాయంత్రం 5 గంటలకే మూసి వేయాల్సిందేనని తీర్మానించారు. గ్రామంలో ప్రస్తుతం 7 కరోనా కేసులు ఉండగా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.