తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇసుకాసురులు: మంజీరలో లారీల కొద్దీ తోడెస్తున్నారు! - manjeera river latest news

మంజీర నదీలో ఇసుకను కొల్లగొట్టేందుకు ఇసుకమాఫీయా పావులు కదుపుతోంది. రెండేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో రాజధానితో పాటు నిజామాబాద్‌, బోధన్‌ ప్రాంతాలకు చెందిన కొందరు గుత్తేదారులు రైతుల పేరుతో ఇసుక తవ్వకాల కోసం గనుల శాఖకు దరఖాస్తులు ఇచ్చారు. అనుమతుల కోసం పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

SAND MAFIA
SAND MAFIA

By

Published : Jun 17, 2020, 1:52 PM IST

మంజీర నదిలో ఇసుకను కొల్లగొట్టేందుకు ఇసుకాసురులు రంగం సిద్ధం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో పట్టాదారులను మచ్చిక చేసుకుని వారి పేరుతో ఇసుక తవ్వకాల కోసం భారీగా దరఖాస్తులు సమర్పించారు. భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ప్రభుత్వం ఐదేళ్ల కిందట పట్టాభూముల్లో అనుమతులు నిలిపివేసింది. రెండేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీన్ని సాకుగా చూపుతూ రాజధానితో పాటు నిజామాబాద్‌, బోధన్‌ ప్రాంతాలకు చెందిన కొందరు గుత్తేదారులు రైతుల పేరుతో గనుల శాఖకు దరఖాస్తులు ఇచ్చారు. అనుమతుల కోసం పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తోడేసి.. సొమ్ము చేసుకునేందుకు

ప్రైవేటు పట్టా భూముల్లో టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు చేపడితే క్యూబిక్‌ మీటరు ఇసుకకు రూ.100 చొప్పున భూ యజమానులకు చెల్లిస్తుంది. గతంలో ఈ సొమ్ము రూ.250 ఉండేది. ప్రస్తుతం తగ్గించింది. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు చేపడితే పట్టాదారులకు వచ్చేది అరకొరే. పట్టాదారుల పేరిట అనుమతులు పొందిన గుత్తేదారులు రాత్రి వేళల్లో మంజీర నుంచి ఇసుక తోడేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయిన రైతులకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. రైతుల పేరుతో ఇసుకను తోడేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి అనుమతులు మంజూరు చేస్తే వారు నదిని గుల్ల చేస్తారని రైతులు వాపోతున్నారు.

గతంలో జరిగిందిలా..

పట్టాదారుల పేరుతో అనుమతులు పొందిన అక్రమార్కులు పెద్దఎత్తున ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా క్వారీలను నిర్వహించిన ఉదాహరణలు కోకొల్లలున్నాయి. గ్రామస్థులు అడ్డుకుంటే వారిని భయబ్రాంతులకు గురిచేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాజధానితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు బాన్సువాడ, బిచ్కుంద మండల కేంద్రాల్లో పాగా వేసి టిప్పర్ల ద్వారా ఇసుకను హైదరాబాద్‌కు తరలించారు.

సర్వే ప్రారంభం

పట్టాభూముల్లో ఇసుక తవ్వకాల దరఖాస్తులపై గనుల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ, భూగర్భ, నీటి పారుదల, అటవీ, టీఎస్‌ఎండీసీ అధికారులు సంయుక్త సర్వే ప్రారంభించారు. ఇప్పటికే 14 ప్రాంతాల్లో సర్వే పూర్తిచేశారు. మిగిలిన చోట్ల కూడా పూర్తిచేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.

డీఎల్‌సీకి ప్రతిపాదనలు పంపిస్తాం

పట్టా భూముల్లో ఇసుక మేటలు తరలించేందుకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సంయుక్త సర్వే చేపడుతున్నాం. వారం రోజుల్లో సర్వే పూర్తిచేసి డీఎల్‌సీ (జిల్లా స్థాయి ఇసుక రేవుల కమిటీ)కి ప్రతిపాదనలు పంపిస్తాం. వారి నిర్ణయం మేరకు అనుమతులు మంజూరు చేస్తాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకం చేసినప్పటికీ క్వారీని టీఎస్‌ఎండీసీకి మాత్రమే ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం.

- రాంబాబు, గనుల శాఖ సహాయ సంచాలకుడు, కామారెడ్డి

ఇదీ చదవండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details