తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాలకు ఏర్పడిన గుంతలు... పట్టించుకోని అధికారులు

ఇటీవల కురిసిన భారీ వర్షాలు రోడ్లను ఛిద్రం చేశాయి. నీళ్లు నిలిచి.. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అడుగు తీసి అడుగేయలేని విధంగా రహదారులు ధ్వంసమయ్యాయి. గుంతల దారుల్లో ప్రయాణం.. వాహనదారులకు నరకం చూపిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన, అంతర్గత రహదారులు అధ్వాన్నంగా మారిపోయాయి. మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు.

roads damaged by heavy rains in kamareddy district
వర్షాలకు ఏర్పడిన గుంతలు... పట్టించుకోని అధికారులు

By

Published : Sep 23, 2020, 5:36 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు... జిల్లా కేంద్రాల నుంచి గ్రామాల వరకు రోడ్లన్నీ అధ్వాన్నంగా మారిపోయాయి. ఎక్కడ చూసినా గుంతలు పడి... అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 242.85 కి.మీల రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు రూ.2.36కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. శాశ్వత నిర్మాణానికి రూ.87.14 కోట్లు అవసరమవుతాయని వెల్లడించారు. కానీ క్షేత్రస్థాయిలో తాత్కాలిక పనులైనా చేపట్టకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఆ రోడ్లలో వెళ్లాలంటే నరకమే...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్ రోడ్డు, వీక్లీ మార్కెట్ రోడ్డు, వ్యవసాయ మార్కెట్ యార్డుకు వెళ్లే దారి, దుబ్బ రోడ్, గిర్ రాజ్ కళాశాల సమీపంలో బైపాస్ రోడ్డు, లలిత మహల్ టాకీస్, గాయత్రినగర్, రైల్వేస్టేషన్ రోడ్డులో గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోధన్, ఆర్మూర్, కోటగిరి, వర్ని, సిరికొండ మండలాల్లోనూ రహదారులు ధ్వంసమయ్యాయి. వర్షాలకు చాలా చోట్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ రహదారుల గుండా వెళ్లాలంటే ప్రయాణికులు నరకం చూస్తున్నారు. బురదమయంగా మారిన రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కామారెడ్డిలోనూ ఇదే దుస్థితి...

కామారెడ్డి జిల్లాలోనూ వర్షాలకు రోడ్లు ధ్వంసమయ్యయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు రామారెడ్డి, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, గాంధారి, తాడ్వాయి మండలాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అడుగడుగునా గుంతలు ఏర్పడి... ప్రయాణికులు నరకం చూస్తున్నారు. పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి లింగాపూర్ వరకు రోడ్డు అధ్వాన్నంగా మారింది. ఇది రెండేళ్లుగా విస్తరణ దశలోనే ఉంది. పనులు పూర్తి కాకున్నా ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ గుంతలు పడి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే ప్రాంతంలో ఓ ప్రసూతి ఆస్పత్రి, పలు విద్యా సంస్థలు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో తరచూ ప్రమాదాలు జరగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పాత బస్డాండ్​కు వెళ్లే రోడ్డులో నాళాలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచి గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రతిపాదనలతో సరిపెట్టకుండా.. మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ప్రమాదాల బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు...!

ABOUT THE AUTHOR

...view details