నిర్భయ, దిశ చట్టాలు ఎన్ని వచ్చినా ఆడవాళ్లు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవ్వరిని వదలడం లేదు. మరి అలాంటి కామాంధుల మెడలు వంచడానికి కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండల పాలకవర్గం నడుం బిగించింది. క్రూర మృగాళ్లా ప్రవర్తించే వారి దుశ్చర్యలు కట్టడి చేయడానికి పటిష్టమైన తీర్మానం చేసింది. మహిళలను ఏ విధంగానైనా వేధింపులకు గురిచేస్తే గ్రామ బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కామాంధుల ఆటకట్టించడానికి పటిష్టమైన తీర్మానం చేసిన రామారెడ్డి మండల పాలకవర్గం న్యాయం జరిగే వరకు పోరాటం
గ్రామంలో ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలు, చిన్నారులపై దాడులకు తెగబడినా ఆ గ్రామం నుంచి వెలివేస్తామని పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. అంతే కాదు... సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించడంతో పాటు శిక్ష పడేవరకు పోరాడతామని స్పష్టం చేసింది. మహిళల రక్షణ కోసమే ఈ తీర్మానం చేసామని ఆ గ్రామ సర్పంచ్ సంజీవులు తెలిపారు. అయితే ఈ తీర్మానం చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధానాన్ని అన్ని గ్రామాల్లో అవలంబిస్తే మహిళలపై దాడులు, అత్యాచారాలు జరగడం తగ్గుముఖం పడతాయని పేర్కొంటున్నారు.
కుటుంబాలే సమాజానికి పట్టుకొమ్మలని గ్రామ సర్పంచ్ సంజీవులు తెలిపారు. తల్లిదండ్రులే పిల్లలకు విలువలు, నియమాలు నేర్పాలని పేర్కొన్నారు. సమాజంలో తిరగడే ప్రతి స్త్రీలో తమ కుటుంబంలోని మహిళలను చూసుకుంటే చాలావరకు మహిళలపై జరిగే అఘాయిత్యాలు తగ్గుతాయన్నారు. అప్పుడే గాంధీజీ కలలు కన్న సమాజం ఏర్పడుతుందని తెలిపారు.
పాలకవర్గానికి కృతజ్ఞతలు
గ్రామ పాలకవర్గం తీసుకువచ్చిన ఈ తీర్మానం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని గ్రామంలోని పలువురు విద్యార్థినిలు తెలిపారు. ఈ తీర్మానం మాకు కొంచెం మనోధైర్యాన్ని కలిగిస్తుందన్నారు. అలాగే మా కుటుంబంలో తల్లిదండ్రులను మమ్మల్ని ధైర్యంగా పైచదువులు చదువుకోవడానికి అవకాశం ఇస్తారన్నారు. ఇతర ప్రాంతాల్లో వృత్తి ఉద్యోగాలలో చేరడానికి సైతం ధైర్యంగా మమ్మల్ని పంపిస్తారని పేర్కొన్నారు. ఈ తీర్మానం తీసుకువచ్చినందుకు రామారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ముఖ్యంగా సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని విద్యార్థినిలు తెలిపారు. అలాగే ఈ గ్రామం వేసిన ముందడుగు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పట్టణాలు మొదలుకొని రాష్ట్రాలు దేశాలు కూడా ముందుకు రావాలని విద్యార్థినిలు కోరారు.
సమాజంలో మహిళల కోసం నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదు. అయితే మేము మా గ్రామ ఆడబిడ్డల రక్షణ కోసం నడుం బిగించాము. మహిళల పట్ల క్రూర మృగాళ్లా ప్రవర్తించే కామాంధులను గ్రామ బహిష్కరణ చేయడానికి మా పాలకవర్గం పటిష్టమైన తీర్మానం చేశాము. -సంజీవులు, గ్రామ సర్పంచ్
మా గ్రామ పాలకవర్గం తీసుకువచ్చినఈ తీర్మానం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మాకు కొంచెం మనోధైర్యాన్ని ఇస్తుంది. మా తల్లిదండ్రులను మమ్మల్ని ధైర్యంగా పైచదువులు చదివించే అవకాశం కల్పిస్తుంది. ఈ తీర్మానం తీసుకువచ్చినందుకు మా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ముఖ్యంగా సర్పంచ్‌కి కృతజ్ఞతలు. మా గ్రామం లానే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పట్టణాలు ఇలాంటి తీర్మానం చేయాలి -విద్యార్థిని
కామాంధుల ఆటకట్టించడానికి పటిష్టమైన తీర్మానం చేసిన రామారెడ్డి మండల పాలకవర్గం ఇదీ చదవండి:Old woman in forest: బామ్మకు కర్పూరమే ఆహారం.. వెంకన్న ఆలయమే ఆవాసం!