తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ  వైద్యం గాల్లో దీపమేనా..? - bhansuwada covid centers

కరోనా సోకిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌ పరిధుల్లో.. ప్రభుత్వ  వైద్యం గాల్లో దీపంలా మారడంతో ధనికులతో పాటు పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటుకు పరుగులు తీస్తున్నారు. ఆక్సిజన్‌, ఐసీయూ పడకలతో.. వారం పది రోజుల చికిత్సకు రూ.2- రూ.4 లక్షల ఖర్చుతో పెను భారాన్ని మోస్తున్నారు. బిల్లులు చెల్లించడానికి బంగారం, ఆస్తులు కుదువ పెడుతూ, అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. 

covid treatment in govt hospitals
covid treatment in govt hospitals

By

Published : May 17, 2021, 9:58 AM IST

Updated : May 17, 2021, 10:23 AM IST

  • ‘‘ జుక్కల్‌ మండలం వజ్రఖండి గ్రామానికి చెందిన ఓ రైతుకు పక్షం రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదిస్తే మందుల కిట్‌ ఇచ్చి పంపారు. వారం రోజులైనా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించేందుకు ప్రయత్నించగా పడక దొరకలేదు. పరిస్థితి విషమంగా మారుతుండడంతో సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పది రోజులకు చనిపోయారు. చికిత్స కోసం రూ.6 లక్షలు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు.’’
  • ‘‘ జుక్కల్‌ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకగా కుటుంబసభ్యులు నాందేడ్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. 10 రోజులపాటు చికిత్స అందించినా పరిస్థితి విషమించి చనిపోయారు. వైద్యం కోసం రూ.3 లక్షలు అప్పు చేశారు.’’
  • ‘‘ పెద్దకొడపగల్‌ మండల కేంద్రానికి చెందిన వ్యాపారికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో పది రోజులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. శ్వాస సంబంధమైన సమస్యలు ఏర్పడడంతో నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పడకలు లేవనడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. 15 రోజులు చికిత్స చేసి రూ.12 లక్షల బిల్లు వసూలు చేశారు. చివరికి పరిస్థితి విషమించి చనిపోయాడని చెప్పారు.’’

బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కరోనా సోకిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ప్రభుత్వ వైద్యం గాల్లో దీపంలా మారడంతో ధనికులతోపాటు పేద, మధ్య తరగతి ప్రజలు కూడా ప్రైవేటుకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి సాధారణ చికిత్స చేయడానికి రోజుకు రూ.15 వేల- రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు కావాలంటే అదనంగా చెల్లించక తప్పడం లేదు. వారం పదిరోజుల పాటు చికిత్స అందించడానికి రూ.2 లక్షల- రూ.4 లక్షల వరకు ఖర్చవుతుండటంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెను భారం పడుతోంది. బిల్లులు చెల్లించడానికి చాలామంది బంగారం, ఆస్తులు కుదువ పెట్టడం, అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.

14 నెలల్లో సౌకర్యాలు మెరుగుపరచలేరా..?
గతేడాది మార్చి నుంచి కరోనా ప్రబలుతోంది. ఇప్పటికీ 14 నెలలు గడుస్తున్నా ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా చికిత్స చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జుక్కల్‌ నియోజకవర్గం పూర్తిగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండడంతో మొదటి దశతో పోల్చితే రెండో దశలో అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు తగ్గించడంతో కేసుల సంఖ్య తగ్గింది. ఇప్పటికీ పిట్లం, పెద్దకొడపగల్‌, జుక్కల్‌, మద్నూర్‌ మండలాల్లో స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు.

సరిహద్దుల్లో అదుపు లేదు
సరిహద్దు గ్రామాల్లో పరిస్థితి కుదుటపడడం లేదు. సమీపంలో ఐసోలేషన్‌ కేంద్రాలు లేకపోవడంతో పాజిటివ్‌ వ్యక్తులు ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రతి మండలంలో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తే రోగులకు కాస్తయినా భరోసా దొరుకుతుంది. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

రెండు ప్రభుత్వ ఆసుపత్రులున్నా..

*బాన్సువాడ డివిజన్‌ వ్యాప్తంగా పేదలకు మెరుగైన కరోనా చికిత్స చేయడానికి ఒక్క ప్రభుత్వాసుపత్రైనా లేకపోవడం గమనార్హం. వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో బాన్సువాడ ఆసుపత్రి ఉన్నప్పటికీ ఇందులో ఐసీయూ సౌకర్యం లేకపోవడంతో పాటు పడకలకు ఆక్సిజన్‌ అందించే సౌకర్యాలు లేకపోవడంతో సిలిండర్లను వినియోగించి కేవలం 15 పడకలు మాత్రమే ఏర్పాటు చేశారు.

*మద్నూర్‌ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది లేని కారణంగా కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేయలేదు. జుక్కల్‌ నియోజకవర్గంలో ప్రభుత్వపరంగా ఐసోలేషన్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.

*బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలో వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఉన్నా అక్కడ ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసి పాజిటివ్‌ వచ్చిన వారికి మందులిచ్చి పంపడం తప్ప చికిత్స అందించడం లేదు. సౌకర్యాలు లేవని చెబుతున్నారు.

*జుక్కల్‌ నియోజకవర్గ పరిధిలోని పిట్లం, బిచ్కుంద, జుక్కల్‌, పుల్కల్‌ డొంగ్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అదే పరిస్థితి. ఊపిరి పీల్చుకోవడం, తీవ్రమైన జ్వరంతో ఎవరైనా ఆసుపత్రులకు వస్తే నిజామాబాద్‌ లేదా హైదరాబాద్‌ వెళ్లండని తిప్పి పంపుతున్నారు.

*నిజామాబాద్‌, కామారెడ్డి ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు దొరక్క ప్రైవేటు బాటపడుతున్నారు. ప్రధానంగా జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద మండలాలకు చెందిన ప్రజలు బీదర్‌, నాందేడ్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. పిట్లం, పెద్దకొడపగల్‌ మండలాలకు చెందిన వారు హైదరాబాద్‌కు వెళ్తున్నారు.

ఇదీ చదవండి:కొవిడ్ కేంద్రాల్లో సాయానికి సైనిక పశు వైద్యులు

Last Updated : May 17, 2021, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details