నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 26 ఇళ్లలో పగటి దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేసి రిమాండ్ పంపించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత చెప్పారు. మహారాష్ట్రకు చెందిన షేక్ చాంద్ అలియాస్ చందు అలియాస్ ఛాందయ్య అలియాస్ సమీర్‌ను పట్టణంలోని రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.
62 తులాల బంగారం, 167 తులాల వెండి స్వాధీనం
సదరు అనుమానితుడిని విచారించగా జిల్లాలోని దేవునిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో 11, కామారెడ్డి పట్టణంలో 6, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 4, 5వ పట్టణ పోలీసు స్టేషన్‌లలోని 9 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని ఆమె స్పష్టం చేశారు. ఇలా మొత్తం రెండు జిల్లాల్లో కలిపి 26 ఇళ్లలో పగటి పూట దొంగతనాలకు పాల్పడిన షేక్‌చాంద్ జల్సాలకు అలవాటు పడి దోచిన సొమ్మును ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. చివరకు పోలీసులకు పట్టుబడిన సమయంలో అతడి వద్ద ఉన్న 62 తులాల బంగారం, 167 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్వేత వెల్లడించారు.