NH161 accidents: కామారెడ్డి జిల్లాలోని ఎన్హెచ్161 ప్రమాదాలకు నిలయంగా మారింది. మద్నూర్ మండలం మేనూర్ వద్ద ఈనెల 18న రాంగ్‌రూట్‌లో వచ్చిన ఆటోని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఐదుగురు మృతిచెందారు. జూన్ 13న పిట్లం శివారులో జరిగిన ఇలాంటి దుర్ఘటనలో ముగ్గురు బలయ్యారు. గతేడాది డిసెంబరు18న జగన్నాథపల్లి వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన క్వాలిస్ ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. సంగారెడ్డి-నాందేడ్-అకోలా 161జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలకు ఈ ఘటనలు ఉదాహరణలు.
సంగారెడ్డిలో ప్రారంభమైన ఎస్ఎన్ఏ 161జాతీయ రహదారి.. కామారెడ్డి జిల్లాలో సుమారుగా 60 కిలోమీటర్లమేర ఉంది. నిజాంసాగర్ మండలం నుంచి పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మండలాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుంది. నిజాంసాగర్ చౌరస్తా, పిట్లం, జుక్కల్ చౌరస్తా.. బిచ్కుంద మండలం పత్లాపూర్, కందర్‌పల్లి సహా గ్రామాల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిజాంసాగర్ చౌరస్తా వద్ద అప్రోచ్ రోడ్డు ఉన్న విషయం తెలియక వాహనాలు రహదారి పైనుంచి రాంగ్‌రూట్‌లో రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పిట్లం వెళ్లేందుకు కింది నుంచి ఉన్న రోడ్డులో వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి ఉండగా.. నేరుగా హైవే మీదకు ఎక్కడంతో దుర్ఘటనలు జరుగుతున్నాయి. గడ్డగుండు తండా వద్ద సర్వీసు రోడ్డు లేకపోవడం, జుక్కల్ వద్ద సూచికలు లేకపోవడం, పెద్దఎక్లార వద్ద వంతెన నిర్మించకపోవడం.. ఇలాంటి కారణాల వల్ల నిత్యం ఏదో ఒక ప్రమాదం జరగడం సాధారణంగా మారింది. ఇప్పటికే అనేక ఘటనలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.