BRS MLA candidate in Kamareddy : రాష్ట్రం సిద్దించిన తర్వాత ప్రజలు కేసీఆర్ అధికారంలోకి రావడానికి రెండు సార్లు అవకాశం కల్పించారు. ఇదే బాటలో నడుస్తూ మూడోసారి విజయం సాధించేందుకు అధికార బీఆర్ఎస్ పక్కా ప్రణాళికలు వేస్తుంది. మరోవైపు టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారిన తర్వాత జరగబోయే మెుదటి ఎన్నికలు కావడంతో అధినాయకత్వం రాజకీయాలపై మరింత దృష్టి సారించింది. "ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు "..కాబట్టి జాతీయ స్థాయిలో రాణించాలంటే ముందు ఇక్కడ వీలైనన్ని సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.
ఇదే కోవలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై రాష్ట్ర అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. కామారెడ్డి జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉండగా, ఓ ఎమ్మెల్యే కు టికెట్ రాదేమోనన్న ప్రచారం సాగుతోంది. కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పని తీరు ఏ మాత్రం బాగాలేదని బీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్ధిని మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, కార్యకర్తల్లో సైతం తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. వరుసగా ఎమ్మెల్యేగా పని చేయడం వల్ల ప్రజల్లో అసంతృప్తి ఓ కారణమైతే.. బహుశా స్వతహాగా ఆయన పనితీరు పెద్ద సమస్యగా మారుండొచ్చని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దీంతో పనితీరు మార్చుకోవాలని కేసీఆర్, కేటీఆర్‌లు సైతం గోవర్థన్‌ను హెచ్చరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డిలో అభ్యర్థి మార్పు తథ్యమైతే తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ఆశావహులు ముందుకు వస్తున్నారు. గంపకు టికెట్ ఇవ్వకుంటే నియోజకవర్గ పరిధిలో సీనియర్ నేత నిట్టూ వేణుగోపాల్‌రావు, మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు, రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ మాజీ ఛైర్మన్ కొమ్ముల తిరుమల్‌రెడ్డి రేసులో ఉన్నారు. అయితే పార్టీ ఆలోచన మరోలా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
గంపగోవర్ధన్ స్థానంలో బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ మహ్మద్ ఖ్వాజా ముజీబొద్దీన్‌కు టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుందని పార్టీ అధినేత సర్వే చేయించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి షబ్బీర్ అలీ పోటీ చేస్తున్న నేపథ్యంలో మైనారిటీ నేతగా ఉన్న ముజిబొద్దీన్‌ను బరిలో దించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా మైనార్టీ నేతకు మరో మైనార్టీతో చెక్ పెట్టినట్టు అవుతుందని గులాబీ దళపతి వ్యూహం.. అందుకే ముజీబ్ పేరు తెరమీదకు తెచ్చినట్టు గులాబీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు పార్టీలోని అగ్రనేతలతో సన్నిహిత సత్సంబంధాలు, మైనారిటీ క్యాడర్‌తో ఉన్న బంధం నేపథ్యంలో ముజీబ్‌ను అవకాశం వరిస్తుందని చర్చించుకుంటున్నారు.
ఇటీవల ముజీబ్ పేరుతో సంక్షేమ పథకాల గురించి పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగే ఓ నిరసనలో సైతం ముజీబ్ సొంతంగా కామారెడ్డిలో కార్యక్రమం నిర్వహించడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైందన్న అనుమానాలు సైతం బలపడుతున్నాయి. ఏదేమైనా కామారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు తప్పదన్న ప్రచారం మాత్రం సాగుతోంది. అయితే మైనార్టీ నేతను నిలబెడతారా?.... లేదంటే కేసీఆర్ బరిలో ఉంటారా అన్నది తేలాల్సి ఉంది.
ఇవీ చదవండి: